మోడీని గద్దె దింపాలి

  •  టిడిపి, వైసిపిలను ఓడించాలి
  •  ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి
  •  మంగళగిరి రోడ్‌షోలో రామకృష్ణ, మధు

ప్రజాశక్తి- మంగళగిరి (గుంటూరు జిల్లా) : కేంద్రంలో మతోన్మాద బిజెపిని, రాష్ట్రంలో టిడిపి కూటమిని, వైసిపిని ఓడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు. ఇండియా వేదిక తరఫున పోటీ చేస్తున్న గుంటూరు పార్లమెంట్‌ సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌, మంగళగిరి అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావులను గెలిపించాలని కోరుతూ మంగళగిరిలో గురువారం రాత్రి రోడ్‌ షో నిర్వహించారు. మంగళగిరి ప్రభుత్వాస్పత్రి నుంచి ప్రారంభమైన ఈ రోడ్‌ షో ద్వారకా నగర్‌, వడ్లపూడి సెంటర్‌, మిద్ది సెంటర్‌ మీదగా పాత కూరగాయల మార్కెట్‌ వద్దగల గాంధీ విగ్రహం వరకు నిర్వహించారు. తీన్మార్‌, ప్రజానాట్యమండలి కళాకారుల వాయిద్యాల పాటలతో, ఎర్రజెండా రెపరెపలాడుతూ రోడ్‌ షో సాగింది. గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో దేశ ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీనీ అమలు చేయలేదని వివరించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా, పరిశ్రమలను మూసివేసి ఉన్న ఉద్యోగులను తొలగించారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించకపోగా విపరీతంగా పెంచారని అన్నారు. ప్రజలపై పన్నుల భారం మోపారని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి గెలవాలని మోడీ చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు. ఎన్నికల్లో టిడిపి, వైసిపి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అభ్యర్థులను రంగంలోకి దించాయన్నారు. వీళ్లంతా ఏనాడూ ప్రజల కోసం పనిచేసిన వారు కాదని తెలిపారు. అలాంటి పార్టీలను ఓడించాలని, ఇండియా వేదిక తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పి మధు మాట్లాడుతూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బిజెపితో రాష్ట్రంలోని టిడిపి ప్రత్యక్షంగా, వైసిపి పరోక్షంగా పొత్తుపెట్టుకున్నాయని తెలిపారు. ఇక్కడ ఈ రెండు పార్టీల వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారని, ఢిల్లీకి వెళ్లేసరికి మోడీకి విధేయులుగా చంద్రబాబు, జగన్‌ ఉంటున్నారని అన్నారు. ఎలాంటి అవినీతీలేని ఢిల్లీ ముఖ్యమంత్రిని మద్యం కుంభకోణం పేరుతో అరెస్ట్‌ చేసి జైలుకు పంపడం దారుణమని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులను, శాస్త్రవేత్తలను, ప్రశ్నించే వారందరిని ప్రధాని మోడీ జైల్లో పెట్టించారని విమర్శించారు. చంద్రబాబును మోడీయే అరెస్టు చేయించారన్నారు. అలాంటి వ్యక్తితో నేడు చంద్రబాబు జతకట్టడం సిగ్గు చేటన్నారు. చేనేత కార్మికుల కోసం పోరాడుతున్నది కమ్యూనిస్టులేనని వివరించారు. చేనేత కార్మికుల కోసం పనిచేయని వారి ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. గుంటూరు ఎంపి అభ్యర్థి జంగాల అజరుకుమార్‌, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి జొన్నా శివశంకరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️