విద్యారంగ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు

Dec 27,2023 21:46 #SFI, #state conference sabha

-విద్వేషాన్ని నింపేలా ఎన్‌ఇపి

-కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు జగన్‌ సర్కారు మద్దతు

-ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలో మాజీ ఎంఎల్‌సి బాలసుబ్రమణ్యం

ప్రజాశక్తి- అల్లూరి సీతారామరాజు నగర్‌ నుంచి ప్రత్యేక ప్రతినిధి : ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు అవసరమని మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) విద్వేషాన్ని నింపేలా ఉందని, సమాన, నాణ్యమైన విద్యను అందించడంలో ఎన్‌ఇపి పూర్తిగా విఫలమైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు జగన్‌ సర్కారు మద్దతు ఇస్తోందని విమర్శించారు. మూడు రోజుల పాటు జరిగే ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభ కాకినాడలోని అల్లూరి సీతారామరాజు నగర్‌, ధీరార్‌ రాజేంద్రన్‌ ప్రాంగణం (అంబేద్కర్‌ భవన్‌)లో మంగళవారం ప్రారంభమైంది. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్‌ అధ్యక్షత వహించిన ప్రారంభ సభలో బాలసుబ్రమణ్యం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో వంద మంది విద్యార్థుల్లో 35 మంది మాత్రమే కళాశాల స్థాయి వరకూ వెళ్తున్నారన్నారు. చదువు అనేది ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రపంచాన్ని మార్చేందుకు ఉపయోగపడాలని పేర్కొన్నారు. అజ్ఞానం, వెనుకబాటుతనం, అణచివేత, దోపిడీ నుంచి విముక్తి కోసం చదువు ఉండాలన్నారు. కానీ, ప్రస్తుతం చదువు ఆ విధంగా లేదని తెలిపారు. నాడు జాతి, కులం, దేశం, ప్రాంతమంటూ అడ్డుగోడలు లేవని, ఇప్పుడు వాటిని పాలకులే నిర్మిస్తున్నారని వివరించారు. వీటిని మొక్కలోనే తుంచేయాలని పిలుపునిచ్చారు. ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థ నిర్వీర్యంరాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని, ఉన్న కాలేజీలను మూసివేసేందుకు కుట్ర పన్నుతున్నారని బాలసుబ్రమణ్యం విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 20 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు 12 వేలకుపైగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 57 వేల సీట్లు, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో రెండు లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సీట్లు మిగిలిపోతున్నాయని తెలిపారు. ఏడాదిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు 3.56 లక్షల మంది తగ్గిపోయారని వివరించారు. రాష్ట్రంలో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టిన తరువాత, పిల్లల చదువులు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయని ఉటంకించారు.కేరళలో ప్రత్యామ్నాయ విద్యా విధానంకేరళలో ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని అక్కడి వామపక్ష ప్రభుత్వం అమలు చేస్తోందని బాలసుబ్రమణ్యం తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే డిజిటల్‌ క్లాస్‌ రూములు, పూర్తి స్థాయి ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు వంటివి ఉన్నాయన్నారు. కాలేజీల్లోనూ, యూనివర్సిటీల్లోనూ విద్యార్థి సంఘం ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. అలాంటి వ్యవస్థ కోసం మన రాష్ట్ర విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఎన్‌ఇపిని వ్యతిరేకించాయని గుర్తు చేశారు.మహాసభ విజయవంతం కావాలి : ఎంఎల్‌సి ఐవిఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభ విజయవంతం కావాలని ఆహ్వాన సంఘం చైర్మన్‌, ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు ఆక్షాకించారు. కాకినాడకు ఎంతో చారితాత్మక నేపథ్యం ఉందని, ఇక్కడ జరుగుతున్న రాష్ట్ర మహాసభ భవిష్యత్తులో మరిన్ని సమరశీల పోరాటాలకు వేదికవ్వాలని సూచించారు. కాకినాడ రేవు పట్టణంగా పేరొందిందని, విద్యాలయాల కేంద్రంగా, రెండవ మద్రాసుగా, మినీ బెంగళూరుగా పిలువబడుతోందని తెలిపారు. మహాసభలో ఎస్‌ఎస్‌ఐ అఖిల భారత అధ్యక్షులు విపి.సాను, ఉపాధ్యక్షులు ఆదర్శ, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షులు వై.వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు టి.రాజా, జిల్లా మాజీ అధ్యక్షులు అరుణ్‌కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నేతలు రాజశేఖర్‌, సిహెచ్‌.అజరు కుమార్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరహాలు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️