తెలంగాణ నుంచి బాపట్ల కూటమికి ఎంపి అభ్యర్థి దిగుమతి

– చీరాలలో ముగ్గురు అభ్యర్థుల మధ్య ఉత్కంఠ పోరు
పోటాపోటీ ప్రచారం
ప్రజాశక్తి – బాపట్ల జిల్లా :బాపట్ల జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓట్ల వేట ప్రారంభించారు. బాపట్ల పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఎస్‌సిలకు రిజర్వు అయిన సంతనూతలపాడు నియోజకవర్గం జిల్లాల పునర్విభజనలో ప్రకాశం జిల్లాలో చేరింది. వేమూరు నియోజకవర్గం ఎస్‌సిలకు రిజర్వు కాగా, మిగతావన్నీ జనరల్‌ స్థానాలు. వైసిపి, టిడిపి తమ ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల ఎంపి అభ్యర్థిని, వేమూరు, అద్దంకి, పర్చూరు అసెంబ్లీల నుంచి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది.
సురేష్‌పై వ్యతిరేకత
ఎన్నికల్లో వైసిపి తరఫున ప్రస్తుత ఎంపి నందిగం సురేష్‌ తిరిగి పోటీ చేస్తున్నారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా తెన్నేటి కృష్ణప్రసాద్‌ పోటీ చేస్తున్నారు. కృష్ణప్రసాద్‌ తెలంగాణలో బిజెపి నేత. ఉమ్మడి ఎపిలో పోలీస్‌ అధికారిగా పలు జిల్లాల్లో పనిచేశారు. టిడిపి సభ్యత్వం కూడా లేకుండానే బాపట్ల ఎంపి సీటు పొందారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి కేంద్ర మాజీ సహాయ మంత్రి జెడి శీలం పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి నందిగం సురేష్‌ టిడిపి అభ్యర్థి శ్రీరాం మాల్యాద్రిపై 16 వేల మోజారిటీతో గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసిపి, టిడిపి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఇద్దరూ ఎస్‌సిలో ఒకే సామాజిక తరగతికి చెందినవారు కాగా కాంగ్రెస్‌ అభ్యర్థి జెడి శీలం వేరే సామాజిక తరగతికి చెందినవారు. వైఎస్‌ షర్మిల రాకతో కాంగ్రెస్‌లో జోష్‌ పెరిగింది. జెడి శీలం గట్టి పోటీ ఇస్తారని చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుత ఎంపి నందిగం సురేష్‌పై, వైసిపిపై ఓటర్లలో అసంతృప్తి ఉంది. ఎంపిగా సురేష్‌ ఏ ప్రాంతానికీ ఎలాంటి మేలూ చేసిన దాఖలాలు లేవని అంటున్నారు.
గట్టి పోటీ
బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి వైపిపి తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే కోన రఘపతి పోటీ చేస్తున్నారు. టిడిపి తరఫున వేగేశన నరేంద్రవర్మ మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచారు. కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైసిపి తరఫున గెలుపొంది మూడో పర్యాయం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ వేరే వారికి టికెట్‌ ఇవ్వాలన్న డిమాండు బాగా వచ్చింది. కానీ కోనకే టికెట్‌ ఖరారైంది. ఇప్పటికే పలువురు వైసిపి నేతలు, ప్రజా ప్రతినిధులు కోనను వ్యతిరేకిస్తూ టిడిపిలో చేరారు. కోన రఘుపతి 2019లో 15 వేల ఓట్ల మోజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్‌ తరఫున బలమైన అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలపాలన్న థ్యేయంతో షర్మిల కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బాపట్లలో అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. చీరాల అసెంబ్లీ నుంచి వైసిపి తరఫున కరణం వెంకటేష్‌ పోటీ చేస్తున్నారు. వెంకటేష్‌ ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు. బలరాం 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున 17 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి తరువాత వైసిపికి మద్దతిచ్చారు. టిడిపి తరఫున ఎంఎం కొండయ్య మొదటిసారి పోటీ చేస్తున్నారు. చీరాల వైసిపి టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. చీరాల టిడిపి టికెట్‌ను ఆశించి భంగపడిన చేనేతకు చెందిన సజ్జా హేమలత ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్థానిక బిసిలకు అన్ని పార్టీల వారు చీరాల టికెట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ స్థానికంగా ఉంది. చీరాలలో ఈసారి టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌ మధ్య ఉత్కంఠ పోరు జరగనుంది.
పర్చూరులో ఇద్దరు ఇన్‌ఛార్జిలను మార్చిన వైసిపి
పర్చూరు అసెంబ్లీ నుంచి వైసిపి తరఫున యడం బాలాజీ పోటీ చేస్తున్నారు. టిడిపి తరఫున ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు 2014, 2019 ఎన్నికల్లో గెలిచి మూడోసారి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఏలూరి సాంబశివరావు వైసిసి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై 1,647 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పర్చూరు నుంచి ఈసారి ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో వైసిపి అధిష్టానం గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ముగ్గురు ఇన్‌ఛార్జులను మార్చింది. అద్దంకి అసెంబ్లీ నుంచి వైసిపి తరఫున పాణెం హనిమిరెడ్డి మొదటిసారి పోటీ చేస్తున్నారు. టిడిపి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ నాలుగో సారి పోటీ చేస్తున్నారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి, 2014లో వైసిపి, 2019లో టిడిపి నుంచి రవికుమార్‌ పోటీ చేసి గెలిచారు. అద్దంకిలో వైసిపి ఇన్‌ఛార్జిగా ఉన్న బాచిన కృష్ణచైతన్యకు టికెట్‌ ఇవ్వలేదు. ఈ కారణంగా కృష్ణచైతన్య, ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్యతోపాటు పలువురు వైసిపి నేతలు, ప్రజా ప్రతినిధులు టిడిపిలో చేరారు. స్థానికేతరుడు అయిన వైసిపి అభ్యర్థి అద్దంకిలో అసమ్మతివాదులతో ఇబ్బందులు పడుతున్నారు.
వైసిపిలో మార్పులు.. చేర్పులు
రేపల్లె అసెంబ్లీ నుంచి వైసిపి తరఫున ఈపూరి గణేష్‌ పోటీ చేస్తున్నారు. టిడిపి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మూడోసారి పోటీ చేస్తున్నారు. అనగాని 2014, 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచారు. రాజ్యసభ సభ్యులు, రేపల్లె వైసిపి ఇన్‌ఛార్జి అయిన మోపిదేవి వెంకటరమణారావును ఈ నియోజకవర్గం నుంచి తప్పించి గణేష్‌కు టికెట్‌ ఇచ్చారు. దీంతో మోపిదేవి అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వేమూరు అసెంబ్లీ ఎస్‌సిలకు రిజర్వు అయింది. ఇక్కడ వైసిపి తరఫున వరికూటి అశోక్‌బాబు పోటీ చేస్తున్నారు. టిడిపి నుంచి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసిపి తరఫున 9,999 ఓట్ల మెజారిటీతో గెలుపొంది మంత్రి అయిన మేరుగ నాగార్జునకు అక్కడ బాగా వ్యతిరేకత ఉందన్న కారణంగా ఆయన్ను సంతనూతలపాడు నియోజకవర్గానికి మార్చారు. వేమూరు నుంచి మంత్రిగా ఉన్న నాగార్జునను ఇక్కడ నుంచి వేరే అసెంబ్లీకి మార్చడం ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లయింది. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ వైపిపి ఇన్‌ఛార్జిగా ఉన్న అశోక్‌బాబును వేమూరు అభ్యర్థిగా తెచ్చారు. నియోజకవర్గానికి పూర్తిగా కొత్త అయిన అశోక్‌బాబు అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఎన్నికల సమరంలో ఎదురీదుతున్నారు.

➡️