ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించాలి

– రాష్ట్రంలో మూతపడిన చెరకు ఫ్యాక్టరీలను తెరిపించాలి
– ఎఐకెఎస్‌ నాయకులు సాగర్‌
ప్రజాశక్తి – గుంటూరు :ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించాలని, రైతు రుణాలు రద్దు చేయాలని, విద్యుత్‌ బిల్లు వెనక్కి తీసుకోవాలని, రైతు సంఘాలకు రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం మోడీ ప్రభుత్వంపై మన పోరాటం కొనసాగించాల్సి ఉందని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) ఉపాధ్యక్షులు టి. సాగర్‌ అన్నారు. రెండురోజులపాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కెబి భవన్‌లో ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాగర్‌ మాట్లాడుతూ.. ఉత్తరాదిలో గంగామైదాన ప్రాంతాల్లో బిజెపిని ఓడించడంలో రైతు ఉద్యమం ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో టిడిపి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సమస్యలు గత ప్రభుత్వ కాలం నుంచి కొనసాగుతున్నాయన్నారు. విభజన హామీలు అమలు కాలేదని, పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందన్నారు. కౌలు రైతులను గుర్తించాలని, భూ యజమానుల సంతకం ఉండాలనే నిబంధనలు తొలగించాలని, అన్ని రకాల ఉపకరణాలు అందించాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసా పథకం కింద ఒక్కొక్క రైతుకు కేంద్రం విడుదల చేసిన రూ.2,000కు కూటమి ప్రకటించిన రూ.20,000 కలిపి వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో మూతపడిన చెరకు ఫ్యాక్టరీలను తెరిపించాలని, ధాన్యం రైతులకు బకాయి పడ్డ రూ.1600 కోట్లను వెంటనే ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు అన్ని రకాల ఉపకరణాలను అందించాలని, ఖరీఫ్‌ సీజన్‌కు సరిపడా విత్తనాలు, ఎరువులను ఆర్‌బికెల ద్వారా రైతులకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పై సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి రైతు సంఘం ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వాలన్నారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, రైతు సంఘం ఉపాధ్యక్షులు వై. కేశవరావు, మర్రాపు సూర్యనారాయణ, జిల్లాల రైతు నాయకులు పాల్గొన్నారు

➡️