12న వైసిపిలోకి ముద్రగడ!

Mar 7,2024 09:20 #join ycp, #Mudragada
  •  దాదాపు ఖాయమైన రాజకీయ పునఃప్రవేశం 
  • పవన్‌ పోటీలో ఉంటే పిఠాపురం నుంచి బరిలోకి?

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ పునఃప్రవేశం దాదాపు ఖాయమైంది. వచ్చే వారంలో ఆయన వైసిపి గూటికి చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వైసిపి అధిష్టానం ఆయనతో చర్చించింది. రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్‌ బుధవారం ముద్రగడను కలిశారు. వైసిపి ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్‌ మిథున్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న వైసిపిలో ముద్రగడ చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే, ముద్రగడకు, ఆయన తనయునికి ఎక్కడ అవకాశం కల్పిస్తారనేది తేలనట్లు సమాచారం. తొలుత టిడిపిలో, అనంతరం జనసేనలో చేరేందుకు ముద్రగడ సుముఖత వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనను కలిసేందుకు నిరాకరించారు. దీంతో, పవన్‌ కల్యాణ్‌కు ముద్రగడ లేఖ రాశారు. ‘నన్ను కలవడానికి మీరు చాలామంది అనుమతులు తీసుకోవాలి’ అని పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి ఆ లేఖలో పేర్కొన్నారు. రాజకీయాల్లోకి పునఃప్రవేశం చేసిన తర్వాత ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌పై గురిపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే అక్కడి నుంచి వైసిపి తరుఫున పోటీకి దిగనున్నారని సమాచారం.

➡️