సమాన పనికి సమాన వేతనం ఇవ్వం

municipal workers strike govt discussions fail
  •  ప్రభుత్వ ప్రకటనతో మున్సిపల్‌ చర్చలు విఫలం 
  • సమ్మె కొనసాగుతుంది : సిఐటియు అనుబంధ సంఘం
  • నేటి నుండి అదే బాటలోకి ఎఐటియుసి, మున్సిపల్‌ జెఎసి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ‘సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా న్యాయం చేస్తాం..’ అని మ్యానిఫెస్టోలో అట్టహాసంగా పేర్కొన్న వైసిపి ప్రభుత్వం తాజగా మాట మార్చింది. సమాన పనికి సమాన వేతనం ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు పెంచేది లేదని స్పష్టం చేసింది. మున్సిపల్‌ కార్మికుల సమ్మె తీవ్రమౌతున్న నేపథ్యంలో కార్మికసంఘాలతో మంగళవారం నిర్వహించిన చర్చల్లో మంత్రుల కమిటీ ఈ మేరకు ప్రకటించింది. ‘సమాన పనికి సమాన వేతనం ఇవ్వడమన్నది సాధ్యమే కాదు’ అని మంత్రుల కమిటీ వ్యాఖ్యనించింది. ప్రభుత్వం వ్వవహరించిన ఈ తీరుతో చర్చలు విఫలమైనాయి. సమ్మె యథావిథిగా కొనసాగుతుందని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ప్రకటించింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము కూడా నేటి (బుధవారం)నుండి సమ్మెను ప్రారంభించనున్నట్లు ఎఐటియుసి, మున్సిపల్‌ జెఎసిలు ప్రకటించాయి. తొలుత ఉదయం 11 గంటలకు సమావేశం ఉందని నాయకులకు సమాచారం పంపిన ప్రభుత్వం మధ్యాహ్నం 1:30 గంటలకు చర్చలు ప్రారంభించింది. రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో తొలుత తాము సానుకూలంగా ఉన్నామని, మీ డిమాండ్లపై సిఎంతో మాట్లాడి చెబుతామని మంత్రులు మున్సిపల్‌ సంఘాల నాయకులకు చెప్పారు.. అరగంట తరువాత మరలా ప్రారంభమైన చర్చల్లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం సాధ్యం కాదని, వెంటనే సమ్మె విరమించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందం హెచ్చరించి అర్ధాంతరంగా చర్చలు ముగించేసింది. దీంతో సమ్మెను కొనసాగిస్తామని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు ప్రకటించారు. ప్రభుత్వం మోసం చేసిందని, తాము కూడా బుధవారం నుండి సమ్మెలోకి వెళుతున్నామని ఎఐటియుసి, మున్సిపల్‌ జెఎసి, స్వతంత్ర సంఘాల నాయకులు ప్రకటించారు. ప్రభుత్వ వైఖరి కారణంగా అనివార్యంగా సమ్మెలోకి వెళుతున్నామని జెఎసి నాయకులు సుబ్బారాయుడు ప్రకటించారు. ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసి సంఘాలు కూడా సమ్మెలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి. గుంటూరు స్వతంత్ర సంఘాల నాయకులు మధుబాబు కూడా తాము సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. ఈసమావేశంలో ప్రభుత్వం తరపున సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఉద్యోగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, డిఎంఇ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎమ్‌డి గంధం చంద్రుడు, ఆప్కాస్‌ ఎమ్‌డి వాసుదేవరావు హాజరయ్యారు. మున్సిపల్‌ కార్మిక సంఘాల తరపున ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, అధ్యక్షులు నాగభూషణం, నాయకులు సోమయ్య, ముత్యాలరావు, జ్యోతిబసు, నూకరాజు, కె శ్రీనివాసరావు, ఎస్‌ రమణ హాజరయ్యారు. ఎఐటియుసి అనుబంధ సంఘం తరపున రంగనాయకులు, సుబ్బారాయుడు, బి రవి, ఎఐసిటియు నాయకులు జి ప్రసాదు, గుంటూరు స్వతంత్ర సంఘం నాయకులు మధుబాబు, ఎస్‌ శంకరరావు, వైఎస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ఆనంద్‌, బి.రవి పాల్గొన్నారు.

మేనిఫెస్టో చూపించిన నాయకులు

చర్చల సమయంలో సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారని, వైసిపి ఎన్నికల మేనిఫెస్టోలోనూ పేర్కొన్నారని, వాటినే అమలు చేయాలని కోరుతున్నామే తప్ప గొంతెమ్మ కోర్కెలు కాదని పేర్కొంటూ నాయకులు వైసిపి మేనిఫెస్టో, 2015 మున్సిపల్‌ సమ్మెలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన వీడియోనూ మంత్రులకు చూపించారు.

న్యాయం జరిగే వరకూ సమ్మెను విరమించం :  కె ఉమామహేశ్వరరావు

మున్సిపల్‌ కార్మికుల విషయంలో ప్రభుత్వం న్యాయంగా వ్యవహరించే వరకూ సమ్మె విరమించేది లేదనిఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు తెలిపారు. చర్చల అనంతరం సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్‌ కార్మికులను సిఎం రాతిమనుషులుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తునాు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఒక మెట్టుదిగినా చివర్లో బెదిరింపులకు దిగారని అన్నారు. ప్రభుత్వం స్పందించి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సమ్మె మరింత తీవ్రం చేస్తామని, మంచినీటి సరఫరా నిలిపేస్తామని, వీధిలైట్లను ఆపేస్తామని హెచ్చరించారు.

మాకు న్యాయం చేయండి : సెక్రటేరియట్‌ స్వీపర్స్‌ నిరసన

రాజధాని ఏర్పాటు అయినప్పటి నుండి తాము విధులు నిర్వహిస్తున్నామని, తమను ఆప్కాస్‌లో చేర్చాలని రాష్ట్ర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న 154 మంది వర్కర్లు నిరసన తెలిపారు. సిఎం వద్దకు వెళ్లిన సమయంలో ఆప్కాస్‌లో చేరుస్తామని హామీనిచ్చారని, ఇంతవరకు అమలుకు నోచలేదని తెలిపారు. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్‌ సంఘాల నాయకులతో చర్చల సందర్భంగా మంత్రుల కమిటీ దృష్టికి వారు తమ సమస్యలు తీసుకువెళ్లారు.

➡️