నగల కోసమే హత్య 

Feb 17,2024 08:06 #Crimes in AP, #Nellore District
Murder for jewelry

వీడిన వృద్ధురాళ్ల హత్య కేసు మిస్టరీ

ప్రజాశక్తి – నెల్లూరు : నెల్లూరు జిల్లాలో ఇద్దరు వృద్ధురాళ్ల హత్య కేసు మిస్టరీ వీడింది. నగల కోసమే కూరగాయల దుకాణం నిర్వాహకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు కేసు వివరాలను ఎస్‌పి డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి తన కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాచలం మండలం కందలపాడుకు చెందిన కప్పిర గిరీష్‌ బుజుబుజనెల్లూరు వద్ద కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 12న చెముడుగుంట, పవన్‌కాలనీ ప్రాంతాలకు చెందిన మేకల జయలక్ష్మి (67), గంగవరపు రాజేశ్వరి (70) కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఇద్దరు వృద్ధురాళ్లతో గిరీష్‌ నమ్మకంగా మాట్లాడుతూ దుకాణం వెనుక ఉన్న ఇంటిలో తాజా కూరగాయలు ఉన్నాయని, వెళ్లి తెచ్చుకోమని నమ్మించాడు. ఒకరి తరువాత ఒకరిని వెంట తీసుకెళ్లి హత్య చేశారు. ఓ వృద్ధురాలిని రోకలి బండతో తలపై బలంగా కొట్టి, మరో వృద్ధురాలిని కత్తితో దాడి చేసి హత్య చేశాడు. జయలక్ష్మి మెడలోని నాలుగున్నర సవర్ల బంగారు నానుతాడు, రెండు ఉంగరాలు, బంగారు గాజులు దొంగిలించాడు. రాజేశ్వరి మెడలోని ఆభరణాలను పరిశీలించగా గిల్టీ నగలని గుర్తించి వాటిని అక్కడే వదిలేశాడు. అనంతరం మృతదేహాలను ఆటోలో వేసుకొని అంబాపురం అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు. అడిషినల్‌ ఎస్‌పి సౌజన్య పర్యవేక్షణలో వెంకటాచలం సిఐ బి.అంకమ్మరావు ఆధ్వర్యంలో సాంకేతికత ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చెడు వ్యసనాల కారణంగా అప్పులు ఎక్కువ కావడం, చేసిన అప్పులు తీర్చాలని ఒత్తిడి అధికం కావడంతో బంగారు నగలు ధరించి కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు వృద్ధురాళ్లను హత్య చేసినట్లు అంగీకరిం చాడు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభను కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్‌పి అభినందించారు.

➡️