నూతన వేతనాలు అమలు చేయాల్సిందే

  • ‘ఉక్కు’ ప్రధాన పరిపాలన భవనం ఎదుట మహిళా కార్మికుల ధర్నా

ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) : నూతన వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మహిళా కార్మికులు సోమవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు. విశాఖ ఉక్కు సామర్థ్యానికి తగ్గ ఉత్పత్తి జరపాలని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో కలపాలని, నూతన వేతనాలు అమలు చేయాలని ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఉత్పత్తికి సరిపడా ముడి సరుకు అందజేయాలని, స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినదించారు. మహిళా కార్మికుల ధర్నాకు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు, యువ కార్మికులు మద్దతుగా నిలబడి నిరసనలో పాల్గొన్నారు. అనేక సవాళ్లతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగాలు సాధించినప్పటికీ ప్రయివేటీకరణ నిర్ణయంతో తమ ఆశలు అడియాసలయ్యాయని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా మారుతుందన్నారు. విశాఖ ఉక్కుకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోగలమన్నారు. స్టీల్‌ ప్లాంట్‌లో ఇప్పటివరకు అనేక ఉద్యమాలు జరిగినా మహిళా కార్మికులు స్వచ్ఛందంగా నిరసన తెలపడం ఇదే ప్రథమం.

➡️