రీ పో లింగ్‌ అవసరం లేదు

May 14,2024 08:06 #CEO Mukesh Kumar Meena, #speech

ఊహించిన దానికంటే ఓటింగ్‌ పెరిగింది : సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రీ పోలింగ్‌ అవసరం లేదని సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా అన్నారు. సచివాలయం మీడియా పాయింట్‌లో సోమవారం సాయంత్రం ఆరుగుంటల తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం, తెనాలి, మాచర్ల ఘటనల్లో అభ్యర్థులను హౌస్‌ అరెస్ట్‌ చేశామని చెప్పారు. పుంగనూరుల సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్‌ఐని వెంటనే సస్పెండ్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరిగిందని, ఊహించినదానికంటే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారన్నారు. ఫిర్యాదులపై మంగళవారం ఆర్‌ఓలు, పర్యవేక్షకులు సమీక్షిస్తారని సిఇఓ తెలిపారు. సాయంత్రం 5గంటలకు 68.04శాతం పోలింగ్‌ జరిగిందన్నారు. 275 బ్యాలెట్‌, 217 కంట్రోల్‌ యూనిట్‌లు, 600 వివిప్యాడ్‌ల సమస్య వచ్చిందన్నారు. మాచర్లలో 8 కేంద్రాల్లో యంత్రాలు మార్చి మళ్లీ పోలింగ్‌ నిర్వహించామని సిఇఓ తెలిపారు. కోడూరులో 2, దర్శిలో 2 చోట్ల ఇవిఎమ్‌లు దెబ్బతిన్నాయన్నారు. ఎక్కడ కూడా ఓటు లేదనే ఫిర్యాదులు రాలేదన్నారు. అనంతపురం, పల్నాడు, చిత్తూరులో హింసాత్మక ఘటనలు జరుగుతాయని ఇంటెలిజెన్సీ రిపోర్టులు ఉన్నాయని, అందుకు అనుగుణంగానే భద్రతా ఏర్పాట్లు చేశామని సిఇఓ తెలిపారు. పల్నాడులో రెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని, మాచర్లలో 8 పోలింగ్‌ కేంద్రాల్లో ఇవిఎమ్‌లు , కోడూరులో 2ఇవిఎమ్‌లు ద్వంసమయ్యాయన్నారు. అన్ని చోట్లా ఇవిఎమ్‌ చిప్‌లు ధ్వంసం అవ్వలేదన్నారు. గంట గంటకూ పోలింగ్‌ ఎక్కువగా నమోదవుతోందని, సాయంత్రం 6గంటల తర్వాత కూడా 3,500 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరుగుతోందన్నారు. రాత్రి 10 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని, ఇప్పటికే చాలా బృందాలు పోలింగ్‌ ముగించుకుని స్ట్రాంగ్‌ రూమ్‌లకు ఇవిఎమ్‌ల తరలింపు చేస్తున్నామన్నారు. రాజకీయపార్టీల నేతల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లను సీల్‌ చేస్తామని సిఇఓ పేర్కొన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ ఉద్యోగులు 90 శాతం పోలింగ్‌ నమోదయ్యిందన్నారు. ఓటింగ్‌ ఆలస్యమవుతుందనే ముందుగానే ఊహించి లైటింగ్‌ ఏర్పాటు చేశామని సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు గుర్తింపుకార్డులు లేకుండా తక్కువ మందిమాత్రమే వచ్చారన్నారు.

➡️