ఏజెన్సీ దోపిడీదారులను తరిమికొట్టండి

  • బిజెపి పల్లకి మోసే టిడిపి, వైసిపిలకు ఓట్లడిగే అర్హత లేదు : వి.శ్రీనివాసరావు
  •  ఉత్సాహంగా సిపిఎం రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు నామినేషన్‌

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, రంపచోడవరం : గిరిజన సమస్యల పరిష్కారంతో పాటు రాజ్యాంగ హక్కులను, చట్టాలను కాపాడుకోవాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరిపైనా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఏజెన్సీ దోపిడీదారులను తరిమికొట్టి పోరాట యోధులైన సిపిఎం అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తమ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యేలు కుంజా బొజ్జి, సున్నం రాజయ్య స్ఫూర్తి అని వివరించారు. ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం రంపచోడవరం అభ్యర్థి లోతా రామారావు సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో గిరిజన సంప్రదాయ కొమ్ము, డోలు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది కార్యకర్తలు ఎర్రజెండాలతో నిర్వహించిన కవాతు ప్రజలను ఆకట్టుకుంది. వి.శ్రీనివాసరావు, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు, అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స ప్రచార వాహనం పై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రదర్శన చేపట్టారు. అనంతరం కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభకు పార్టీ ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి.కిరణ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి అభ్యర్థుల జాబితాను చూస్తే దొంగల ముఠాలా ఉందని విమర్శించారు. ఆ పార్టీ అరకు అభ్యర్థి కొత్తపల్లి గీత ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. బిజెపి పొత్తు, తొత్తు పార్టీలను ఈ ఎన్నికల్లో సాగనంపాలని పిలుపునిచ్చారు. వందల కోట్ల రూపాయలు ప్రజలపై వెదజల్లి మళ్లీ అధికారం చేపట్టి పన్నులు, ధరల రూపంలో ప్రజల జేబులు కొల్లగొట్టడంతోపాటు సహజ వనరులను కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయని విమర్శించారు. పోరాడి సాధించుకున్న గిరిజన చట్టాలకు పదేళ్లలో బిజెపి పూర్తిగా తూట్లు పొడిచిందని, ఆ పార్టీకి మద్దతు తెలిపిన వైసిపి, టిడిపి, జనసేనలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. టిడిపి, వైసిపి ప్రభుత్వాల నిర్వాకం ఫలితంగా పోలవరం ప్రాజెక్టు కాళేశ్వరం కంటే బలహీనంగా మారిందని వివరించారు. ప్రాజెక్టుకు ప్రమాదం జరిగితే గిరిజన ప్రాంతాలతోపాటు ఉభయగోదావరి జిల్లాలు పూర్తిగా ముంపునకు గురవడం ఖాయమని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించిన కాంట్రాక్టు సంస్థ నుంచి బిజెపి, టిడిపి, వైసిపిలకు వెయ్యి కోట్లు ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో అందాయని తెలిపారు. పోలవరం నిర్వాసితుల హక్కులు, ఆదివాసీల చట్టాల కోసం సిపిఎం చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సిపిఎం భద్రాచలం మాజీ ఎంపి మిడియం బాబూరావు మాట్లాడుతూ ఏజెన్సీ పెద్ద దొంగ అనంతబాబు అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి వరదలు మూడేళ్లపాటు వరుసగా ఈ ప్రాంతాన్ని ముంపునకు గురిచేసినా టిడిపి, వైసిపి ప్రజా ప్రతినిధులెవరూ పట్టించుకోలేదని గుర్తు చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు సిపిఎంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సత్యనారాయణ మాట్లాడుతూ సిపిఎం గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి డి.సత్యనారాయణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, నాయకులు దడాల సుబ్బారావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు, పలు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️