పాలకులంకాదు..మీ సేవకులం!

  • ఆరు గ్యారంటీలపై రేవంత్‌ తొలిసంతకం
  • ఎల్‌బి స్టేడియంలో సిఎంగా ప్రమాణస్వీకారం
  • హాజరైన కాంగ్రెస్‌ అగ్రనేతలు
  • ప్రగతి భవన్‌ ఇక మహాత్మా పూలే ప్రజాభవన్‌
  • నేటి నుండి ప్రజాదర్బార్‌లు
  • 9వ తేది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : కేబినెట్‌ నిర్ణయం

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పథకాల అమలుకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. వికలాంగురాలైన నిరుద్యోగ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ రజనీకి ప్రభుత్వ ఉద్యోగం మంజూరుకు సంబంధించిన ఫైలుపై రెండో సంతకం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని గతంలో ఆమెకు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆమెను ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆహ్వానించి, ఉద్యోగ నియమాక పత్రాన్ని అందచేశారు. ఎల్‌బి స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజానీకం రేవంత్‌రెడ్డి ఈ సంతకాలు చేస్తున్నంత సేపు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. అంతకుముందు మధ్యాహ్నం 1.22 గంటలకు గవర్నర్‌ తమిళిసై రేవంత్‌రెడ్డి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక, కర్ణాటక సిఎం సిద్దరామయ్య, ఎఐసిసి పరిశీలకులు పలువురు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం వారు రేవంత్‌రెడ్డిని అభినందించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రజలనుద్దేశించి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ తాము పాలకులం కాదు సేవకులమని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయమే తమ విధానమన్నారు. రైతులు, విద్యార్ధులు, నిరుద్యోగులు, అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని చెప్పారు. ప్రగతి భవన్‌ను ఇక నుండి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం నుండి ప్రతిరోజు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. సచివాలయానికి కూడా ప్రజలు రావచ్చన్నారు. డిప్యూటి సిఎంగా భట్టి సిఎంగా రేవంత్‌ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం గవర్నర్‌ తమిళసై

డిప్యూటీ సిఎం భట్టి

విక్రమార్క చేత , పది మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం డిప్కూటీ సిఎం భట్టి విక్రమార్కకు రెవెన్యూశాఖను కేటాయించారు.

హోం శాఖను ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి, మున్సిపల్‌ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆర్థికశాఖ మంత్రిగా డి.శ్రీధర్‌బాబు, నీటి పారుదలశాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహిళా సంక్షేమశాఖ మంత్రిగా కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహ, పౌర సరఫరాలశాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు, బిసి సంక్షేమశాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్‌, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా సీతక్క, రోడ్లు,భవనాల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు నియమితులైనారు.

సచివాలయంలో కేబినెట్‌ సమావేశం

సుదీర్ఘ విరామం తరువాత మంత్రిమండలి సమావేశం సచివాలయంలో జరిగింది. గత ప్రభుత్వ హయంలో ప్రగతి భవన్‌లోనే మంత్రిమండలి సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిహోదాలో సాయంత్రం ఐదు గంటలకు రేవంత్‌రెడ్డి తొలిసారి సచివాలయానికి వచ్చారు.పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సిఎం కార్యాయలం ప్రధాన ద్వారం వద్ద వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఆయన లోపలికి వెళ్లారు. అనంతరం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి రవి వర్మ , పలువురు సీనియర్‌ ఐఎఎస్‌, ఐపిఎస్‌లు సిఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆరు గ్యారంటీలపై ప్రధానంగా చర్చ జరిపారు. ఆర్‌టిసిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని సోనియాగాంధీ జన్మదినమైన తొమ్మిదవ తేది నుండి అమలులోకి తీసుకురావాలని, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలను పెంచాలన్న నిర్ణయాన్ని కూడా ఆ రోజు నుండే అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. 9వ తేది నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రగతి భవన్‌ ముందు బారికేడ్ల తొలగింపు

సిఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌ ముందున్న బారికేడ్లను అధికారులు తొలగించారు. దీంతో పాటు అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ను, సెక్యూరిటీ సిబ్బందికోనం నిర్మించిన షెడ్‌నుకూడా తీసివేశారు. గ్యాస్‌ కట్టర్ల సాయంతో వీటిని తొలగించారు. భద్రతా కారణాల రీత్యా గత ప్రభుత్వంలో వీటిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ముందే అధికారులు ఈ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రేవంత్‌రెడ్డి చేసిన తొలి ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘ప్రగతి భవన్‌ వద్ద అడ్డంకులు కూలిపోతున్నాయి..’ అని ఆయన అన్నారు.

➡️