ఒపిఎస్‌ను పునరుద్ధరించాల్సిందే

Jan 29,2024 07:40 #ops, #utf

-యుటిఎఫ్‌ సభలో వక్తల డిమాండ్‌

-ఫిబ్రవరి ఒకటి నుంచి ఉద్యమ కార్యాచరణ

-ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:ఒపిఎస్‌ను అమలు చేయాల్సిందేనని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. ‘ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌’ సభ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎస్‌కెవిడి డిగ్రీ కళాశాల ఆవరణలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గన్న ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ పెన్షన్‌ బిక్ష కాదని, హక్కని గుర్తు చేశారు. ఉద్యోగులకు పెన్షన్‌ అనేక పోరాటాల ఫలితంగా అమల్లోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉద్యోగులకు సిపిఎస్‌ పెన్షన్‌ అమలవుతోందన్నారు. పాత పెన్షన్‌ విధానంపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. క్షిపణికంటే ప్రజాభిప్రాయం శక్తివంతమైందన్నారు. జిపిఎస్‌ కూడా సిపిఎస్‌ వంటిదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సిపిఎస్‌, జిపిఎస్‌ తెచ్చిన వారిని ఓడించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల న్యాయమైన ఆందోళన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసుల సహకారంతో అణచివేయాలని చూడడం సరికాదన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ ఒపిఎస్‌ కోసం జరిగే పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, గెలిచిన తరువాత కార్పొరేట్లకు సేవ చేయడం ఆనవాయితీగా మారిందని విమర్శించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిపిఎస్‌లోని డొల్లతనాన్ని వివరించారు. గ్యారెంటీ లేని పెన్షన్‌కు గ్యారెంటీ పేరు పెట్టారన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో అమలవుతున్న జిపిఎస్‌ వల్ల అక్కడి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు. ఒపిఎస్‌ కోసం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఒపిఎస్‌ను అన్ని రాజకీయ పార్టీలూ మేనిఫెస్టోలో చేర్చడంతోపాటు గెలిచాక మొదటి సంతకంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 12 నుంచి మండల స్థాయిలో, ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 25 నుంచి 28 వరకూ జిల్లా స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులనూ కలిసి ఈ మేరకు వినతిపత్రాలు ఇవ్వాలన్నారు. మార్చి నుంచి ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పేరుతో ప్రతి ఇంటికీ, వాహనాలకు స్టిక్కర్లు అంటించాలని కోరారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభల్లో ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ ప్లకార్డులను ప్రదర్శించాలన్నారు. మార్చి 15 తర్వాత చర్చా వేదికలు, మార్చి 26 నుంచి 30 వరకూ బైకు ర్యాలీలు నిర్వహించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ మాట్లాడుతూ ఒపిఎస్‌ దేశ వ్యాప్త సమస్య అన్నారు. పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో సిపిఎస్‌కు వ్యతిరేకంగా జరిగిన నిర్ణయాలను ప్రస్తావించారు. ఇపిఎఫ్‌-95 ఉద్యోగులు ఇప్పటికీ కొద్దిపాటి పెన్షన్‌తో అవస్థలు పడుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌కు ఏ రాజకీయ పార్టీ నుంచీ మద్దతు లభించకపోతే శాసన సభలకు సొంతంగా ప్రతినిధులను పంపేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లోని సిపిఎస్‌ బాధితుల వివరాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. విశాల ప్రజా సమీకరణతో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో నిర్ణయించే శక్తిగా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు, సిపిఐ నాయకులు జ్యోతిరావు, ఆప్‌ రాష్ట్ర నాయకులు వై.శ్రీనివాసరావు, బిఎస్‌పి నాయకులు పట్నాల విజరుకుమార్‌ తదితరులు పాల్గని మద్దతు తెలిపారు.

➡️