విమర్శలకే పరిమితం – ఉక్కు పరిరక్షణపై స్పష్టత ఇవ్వని పవన్‌

Apr 8,2024 07:23 #janasena pawan, #speech

– అనకాపల్లిలో వారాహి విజయ భేరి యాత్ర
ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి :’స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకంపై ప్రధానిని తిడితే లాభం లేదు. పిఎం దగ్గరకు వెళ్దామని చెప్పినా రావడానికి ఎవరూ ముందుకురాలేదు’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అనకాపల్లిలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన వారాహి విజయ భేరి యాత్రలో ఆయన మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలన్న కోరిక తనకు ఉందని.. అయితే, ప్లాంట్‌ రక్షణ తన ఒక్కడి వల్లే సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. ఉక్కు పరిరక్షణకు తాము ఏం చేస్తామన్న విషయంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ప్లాంట్‌కు సొంత గనుల అవసరాన్ని జాతీయ నాయకులకు వినిపిస్తానని మాత్రమే చెప్పారు. తన పోరాటం వల్లే ఉద్దానం సమస్య పరిష్కారమైందని తెలిపారు. చెత్త పన్ను తొలగించాలని చంద్రబాబుకు చెబుతానని అన్నారు. అక్రమ క్వారీల అనుమతులు రద్దు చేస్తామని పేర్కొన్నారు. తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి దానికి అనుసంధానంగా ఇథనాల్‌ తయారు చేసి ఎగుమతి చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సిఎం జగన్‌ ఇసుక, సారా వ్యాపారి, భూ దోపిడీదారు అని ఆరోపించారు. క్రిమినల్‌ ప్రభుత్వం వైసిపిని రోడ్డుపైకి ఈడ్చి రాష్ట్ర సరిహద్దు అవతల పడేస్తామన్నారు.
యువతలో ప్రతిభను వెలికి తీసేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిపిఎస్‌ రద్దు చేస్తామని చెప్పకుండా, ప్రభుత్వ ఉద్యోగికి భద్రత ఉండేలా ఏడాదిలోపు చర్యలు తీసుకుంటామని పవన్‌ చెప్పుకొచ్చారు. బరోడా తరహాలో అనకాపల్లి డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు శుద్ధి చేసే ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇపిడిసిఎల్‌లో విలీనం చేసిన కశింకోట సహకార విద్యుత్‌ సంస్థను తిరిగి సహకార రంగంలో కొనసాగేలా చూస్తామని, బెల్లం రైతులకు మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విస్సన్నపేటలో కోడి గుడ్డు మంత్రి 609 ఎకరాలు అక్రమించారని అమర్‌నాథ్‌పై విమర్శలు సంధించారు. శారద నది తీరం, బజ్జన్న కొండ ప్రాంతాలను టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దితే యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. సుజల స్రవంతికి బడ్జెట్‌ కేటాయిస్తామని చెప్పారేగానీ ఎప్పటిలోగా పూర్తి చేస్తారో పవన్‌ చెప్పలేకపోయారు. అంతకు ముందు ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో అనకాపల్లి బిజెపి ఎంపి అభ్యర్థి సిఎం.రమేష్‌, అనకాపల్లి, పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్‌ బాబు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️