పేరుకుపోయిన ఫైళ్లు..! 

pending files in anantapuram corporation
  • అనంతపురం కార్పొరేషన్‌లో విచిత్ర పరిస్థితి 
  • బోగస్‌ ఫైళ్లూ ఉన్నాయనే సందేహాలు 
  • సంతకాలు చేయడంలో నూతన కమిషనర్‌ సందిగ్ధం

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులకు సంబంధించి ఫైళ్ల క్లియరెన్స్‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలుస్తోంది. పనులు చేయకుండానే ఫైళ్లను పంపుతున్నారా అనే వాదన కూడా ఉంది. కార్పొరేషన్‌లో పనిచేసే కొందరు అధికారులు బోగస్‌ ఫైళ్లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు ఆపరేటర్లు ఇలాంటి వ్యవహారాలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మేఘ స్వరూప్‌ ఇటీవల ఐఎఎస్‌ శిక్షణ పూర్తి చేసుకుని అనంతపురం కార్పొరేషన్‌ విధులకు కొత్తగా వచ్చారు. ఆయన విధులుకు కొత్త కావడంతో పాలనాపరమైన అంశాలను అవగాహన చేసుకునే పనిలో పడ్డారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ఉన్న ఫైళ్లపై ఆయన సంతకం చేసేందుకు తటపటాయిస్తున్నారు. పూర్తిగా వాటిని చూడనిదే సంతకం చేస్తే ఎలాంటి సమస్య వస్తుందో అన్న భావనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఒక వేళ కమిషనర్‌ అన్ని ఫైళ్లను పరిశీలిస్తే బోగస్‌ ఫైళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం కన్పిస్తోంది. నకిలీ ఫైళ్ల వ్యవహారం బయటకు వస్తే ఎవరి కొంప మునుగుతుందో అన్న భయం అటు అధికారులు, ఇటు కొందరు గుత్తేదారుల్లో కన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నూతన కమిషనర్‌ పెండింగ్‌ ఫైళ్లను పూర్తి స్థాయిలో పరిశీలించి బోగస్‌ బహిర్గతమయ్యేలా చర్యలు చేపడతారా.? లేక ఒత్తిళ్లకు జడిసి గత అధికారుల మాదిరే మౌనంగా ఉంటారా అన్న సందేహాన్ని గుత్తేదారులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఫైళ్ల వ్యవహారంలో వాస్తవాలను బయటకు తీయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.

కొలిక్కిరాని కంప్యూటర్ల సమస్య

కార్పొరేషన్‌లో కంప్యూటర్ల సమస్య కొలిక్కి రావడం లేదు. కంప్యూటర్ల కొనుగోలులో కొటేషన్లను తగ్గించి రెండు దపాలుగా టెండర్లు నిర్వహించినా ఒక్క గుత్తేదారు కూడా ముందుకు రాలేదు. నూతన కమిషనర్‌ మేఘస్వరూప్‌ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే రెండోసారి కంప్యూటర్ల కొనుగోలుకు మరో టెండర్‌ నోటీసు ఇచ్చారు. కంపెనీ రేట్లు తగ్గించి నిర్వహించిన టెండర్లలో పాల్గొని నష్టపోవటం ఇష్టం లేక కాంట్రాక్టర్లు ముఖం చాటేశారు. అధికారుల నిర్వాకంతో ఇంజినీరింగ్‌ అధికారులు కంప్యూటర్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభావం నగరంలో అభివృద్ధి పనులపై పడుతోంది. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నిర్వాకంతో నాలుగు నెలలుగా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కంప్యూటర్‌ సామగ్రి టెండర్ల ప్రక్రియ ఒక అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఈ సమస్యపై సకాలంలో అటు పాత కమిషనర్‌ భాగ్యలక్ష్మి గానీ, నూతన కమిషనర్‌ మేఘ స్వరూప్‌ గానీ పూర్తి స్థాయిలో స్పందించలేదన్న విమర్శలు ఉన్నాయి.

➡️