రూ.4 వేలు పింఛను

  • ఉద్యోగులకు పిఆర్‌సి, పంచాయతీలకు నిధులు
  • యుద్ధానికి అందరూ సిద్ధం కావాలి : కుప్పంలో చంద్రబాబు

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : తాము అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఒకటిన నాలుగు వేల రూపాయలు పింఛను ఇంటికే తీసుకొచ్చి అందిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. లాయర్లకు, జర్నలిస్టులకు, మహిళలకు, టీచర్లకు, ఉద్యోగులకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలిస్తామని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన చిత్తూరు జిల్లా కుప్పం వచ్చారు. ఈ సందర్భంగా కుప్పంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయని, యుద్ధానికి అందరూ సిద్ధం కావాలని టిడిపి శ్రేణులను కోరారు. 40 రోజులు అలుపెరగకుండా కష్టపడితే విజయం మనదేనన్నారు. ‘కుప్పంలో లక్ష మెజార్టీకి సిద్ధమా?’ అంటూ కార్యకర్తలను, పార్టీ శ్రేణులను ఉత్సాహపర్చారు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి ఇస్తామని, అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు నిధులు కేటాయించి పూర్వ వైభవం, ప్రజాపాలన తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఎన్‌డిఎతో పొత్తు తప్పనిసరని సమర్థించుకున్నారు. బిజెపితో పొత్తును ముస్లిం, మైనార్టీ సోదరులు వేరుగా భావించవద్దని, వారి ప్రయోజనాలను కాపాడతానని చెప్పుకొచ్చారు. పేదవారికి అన్నం పెట్టాలని అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే, జగన్‌ వచ్చాక వాటిని ధ్వంసం చేశారన్నారు. జగన్‌ పది రూపాయలిచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారని, దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. వైసిపి నాయకులు భూ కబ్జాలకు పాల్పడడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అందుకు కడప జిల్లా ఒంటిమిట్ట పద్మశాలీ కుటుంబమే తాజా ఉదాహరణని పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌, గంజాయి ప్రభుత్వం రాజ్యమేలుతోంది. మత్తుకు బానిసై యువత చెడ్డదారి పడుతోంది. జాతి నిర్వీర్యం అవుతోంది.’ అని అన్నారు. వలంటీర్‌ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. అయితే, వలంటీర్లు వైసిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వలంటీర్లలోనూ బాగా చదువుకున్న వారు ఉన్నారని, తాము అధికారంలోకి వస్తే అటువంటి వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ ఇచ్చి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు జీతం వచ్చేలా చూస్తామన్నారు. వేదికపై చిత్తూరు పార్లమెంట్‌ ఎంపి అభ్యర్థి దుగ్గిమళ్ల ప్రసాదరావు, కుప్పం ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, పిఎస్‌ మునిరత్నం, గౌనివారి శ్రీనివాసులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు ప్రత్యేక విమానంలో వచ్చి, రోడ్డు మార్గం ద్వారా కుప్పంలోని టిడిపి కార్యాలయానికి ఉదయం 11 గంటలకు చంద్రబాబు చేరుకున్నారు. కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం ముఖ్య కార్యకర్తలతో ఆయన అంతర్గత సమావేశం, మహిళలతో మాటామంతీ నిర్వహించారు.

➡️