ప్రజల మనిషి సాంబశివరావు – ప్రధమ వర్ధంతి సభలో వక్తలు

May 22,2024 22:50 #cpm leader, #sabha

ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా) :ప్రజల మనిషి నిష్కళంక కమ్యూనిస్టు వల్లభనేని సాంబశివరావు జీవితం అందరికీ ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిపిఎం తెనాలి డివిజన్‌ దుగ్గిరాల మండల మాజీ కార్యదర్శి వల్లభనేని సాంబశివరావు ప్రధమ వర్ధంతి సభ బుధవారం దుగ్గిరాల మండల కార్యదర్శి జెట్టి బాలరాజు అధ్యక్షతన తుమ్మపూడిలో జరిగింది. తొలుత సాంబశివరావు అమర స్తూపం ముందు పతాకాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి తులసీదాస్‌ ఆవిష్కరించారు. సాంబశివరావు చిత్రపటానికి సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తులసీదాస్‌ మాట్లాడుతూ.. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని సాంబశివరావు తూచా తప్పకుండా పాటించారని, ఆయన జీవితం ఆదర్శనీమని, కుటుంబాన్ని కూడా పార్టీ వైపు నడిపించారని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ.. నేటి తరానికి, విలువలకు నిలువుటద్దంగా సాంబశివరావు నిలిచారని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక ఉద్యమంలో ఆయన క్షేత్రస్థాయిలో పూర్తిగా అధ్యయనం చేసేవారని, అనంతరమే దానిపై ఆందోళన నిర్వహించేవారని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల తన అనుబంధంలో మచ్చలేని నాయకుడు సాంబశివరావు అని పేర్కొన్నారు. సిపిఎం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి, రైతు సంఘం నాయకులు జన్న శివశంకర్‌, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె ఉమామహేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ధనలక్షి, బాపట్ల జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అగస్టీన్‌, తెనాలి డివిజన్‌ కార్యదర్శి మలకా శివ సాంబి రెడి,్డ అమరావతి డివిజన్‌ కార్యదర్శి ఎం రవి, జిల్లా నాయకులు ఈమని అప్పారావు, చెంగయ్య, డి వెంకటరెడ్డి, సిపిఎం గ్రామ కార్యదర్శి ఎం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

➡️