రికార్డు బద్దలు కొట్టిన పోచారం

Dec 3,2023 14:44 #Assembly Elections, #Telangana

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : గత ఆనవాయితికి అడ్డుకట్ట వేస్తూ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నిజాంబాద్‌ జిల్లా బాన్సువాడ నుంచి గెలిచారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ స్పీకర్‌గా పనిచేసిన వారు తరువాత ఎన్నికల్లో గెలవడం తెలుగు రాష్ట్రాల్లో కనిపించలేదు. గతంలో స్పీకర్లుగా పనిచేసిన మధుసూదనా చారి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, నాదెండ్ల మనోహర్‌, సురేష్‌ రెడ్డి, ప్రతిభా భారతి తదితరులు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మధుసూధనాచారి భూపాల్‌పల్లిలో రెండోసారి ఓటమితో ఈ నమ్మకం మరింత బలపడింది… ఈ భయంతో అసెంబ్లీ స్పీకర్‌ పదవి అంటేనే ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడున్న పరిస్థితుల్లో సిఎం కెసిఆర్‌ పోచారంను ఒప్పించి స్పీకర్‌ పదవి ఇచ్చారు. స్పీకర్ల ఓటమి ఆనవాయితి భయంతో ఒక దశలో పోచారం పోటీ చేసిన బాన్సువాడ స్థానం నుంచి ఆయన కుమారుడిని బరిలో నిలపాలని అనుకున్నప్పటికి చివరికి ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించారు. బాన్సువాడ నుంచి వరుసగా నాలుగోసారి ఘన విజయం సాధించి రికార్డు సృష్టించారు.

➡️