అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు 

Dec 28,2023 09:04 #Crimes in AP
police arrest interstate thief

 

రూ.30 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ : రాత్రి వేళల్లో ఇళ్లు, బ్యాంకులల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌ చేసిన వారి నుంచి రూ.30లక్షలు విలుగల 520 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వై.రిషాంత్‌ రెడ్డి తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం ఉదయం అందిన సమాచారం మేరకు ముద్దాయిలను పలమనేరు – గంగవరం ఫ్లైఓవర్‌ దగ్గర అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఈ ముద్దాయిల పైన మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా పలు కేసులున్నట్లు జిల్లా తెలిపారు. డిఎస్‌పి ఎన్‌.సుధాకర్‌ రెడ్డి పర్యవేక్షణలో జిల్లాలోని పుంగనూరు, సదుం, గంగవరం, రామకుప్పంలో రాత్రి సమయంలో జరిగిన దొంగతనాలను ఛేదించే క్రమంలో పలమనేరు డి.ఎస్పీ పోలీసులను 4 బందాలుగా ఏర్పరిచి ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు అంతటా విచారణ జరిపినట్లు తెలిపారు. సదరు ముద్దాయిలు ఇళ్ళలోనే కాకుండా బ్యాంకు దోపిడిలు కూడా చేసేవారని పేర్కొన్నారు. వీరిని పుంగనూరు ఎస్‌ఐ సుకుమార్‌ సిబ్బందితో కలిసి పలమనేరు – గంగవరం ఫ్లైఓవర్‌ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు అయిన వారు రమేష్‌, గోవిందరాజు, శ్రీనివాసులను, గవియప్ప, గణేష్‌, అశ్వత్‌ నారాయణగా గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ.30లక్షలు విలువ గల 520 గ్రాముల బంగారు ఆభరణాలను రూ.5లక్షలు విలువ గల రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

➡️