పేదలపై పోలీసుల బీభత్సకాండ

Feb 28,2024 09:37 #against, #police brutality, #Tirupati
  • కరకంబాడిలో గుడిసెల కూల్చివేత, లాఠీఛార్జి
  • సిపిఎం నేతల గృహనిర్బంధం

ప్రజాశక్తి- తిరుపతి, అమరావతి బ్యూరో : పేదలపై తిరుపతి పోలీసులు విరుచుకుపడి బీభత్సం సృష్టించారు. గుడిసెలను జెసిబితో కూల్చి వేశారు. అడ్డుకున్న వారిపై లాఠీఛార్జి చేశారు. దీంతో, పేదల రోదనలు మిన్నంటాయి. పోలీసులు పథకం ప్రకారం. సిపిఎం నేతలను ముందుగా గృహనిర్బంధం చేశారు. జానెడు ఇంటి స్థలం కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి విసిగి, వేశారి చివరకు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడీ ఎర్ర గుట్టపై పేదలు గుడిసెలను సిపిఎం ఆధ్వర్యాన నిర్మించుకొని 33 రోజులుగా అక్కడే ఉంటున్నారు. అక్కడికి జెసిబితో వందలాదిమంది పోలీసులు వచ్చాయి. ఆ గుడిసెల్లోని పేదలను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. అనంతరం జెసిబిలతో వాటిని నేలమట్టం చేశారు. అడ్డుకోబోయిన వారిపై లాఠీఛార్జి చేశారు. ఇళ్ల స్థలాల సాధన పోరాట కమిటీ అధ్యక్షులు రాజశేఖర్‌, కార్యదర్శి సత్యశ్రీ, కమిటీ నాయకులు రాధిక, మునిబాబు, అరుణ్‌, మస్తాన్లను గుడెసెల్లో నుంచి బయటకు లాక్కొచ్చి పోలీస్‌ వ్యాన్‌లోకి ఎక్కించారు. వారిని విడిచిపెట్టాలంటూ పేదలు వ్యాన్‌ను అడ్డుకోగా, పోలీసులు వారిపై లాఠీలు ఝులిపించారు. సిపిఎం నాయకులు శివానందంపై విక్షణా రహితంగా దాడి చేయడంతో ఆయన స్ఫృహ తప్పి పడిపోయారు. పోలీసుల లాఠీఛార్జీలో సిపిఎం సీనియర్‌ కార్యకర్త వెంకటరమణ ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. అరెస్టు చేసిన వారిని ఏ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళతున్నారో కూడా తెలియనీయకుండా తిరుపతి, రేణిగుంట, ఏర్పేడు, కాళహస్తిల చుట్టూ తిప్పి, ఆ తర్వాత విడిచిపెట్టారు. అంతకు ముందు మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య, రేణిగుంట మండల కార్యదర్శి హరినాథ్‌, సిఐటియు మండల అధ్యక్షులు నరసింహారెడ్డిలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. గుడిసెల తొలగింపు అనంతరం వారిని విడిచిపెట్టారు. దీంతో, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆధ్వర్యంలో సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు రేణిగుంట పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకొని అక్కడ ధర్నా చేశారు. పేదలకు న్యాయం చేయాల్సిన జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి ఇలా కుట్ర చేసి పేదలపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు. గుడిసెలు వేసుకున్న వారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుడిసెల తొలగింపు అన్యాయం : సిపిఎం గుడిసెలను బలవంతంగా తొలగించి, అడ్డుకున్న వారిపై లాఠీఛార్జి చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలని కోరారు. ఒకవైపు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్న వైసిపి ప్రభుత్వం, మరోవైపు పేదలు వేసుకుంటున్న గుడిసెలను తొలగిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

➡️