ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ దారుణం : సిఐటియు

May 24,2024 21:25 #Dharna, #visaka steel plant

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయడం దుర్మార్గమని సిఐటియు జగదాంబ జోన్‌ కార్యదర్శి కెవిపి.చంద్రమౌళి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారానికి 1149వ రోజుకు చేరాయి. దీక్షల్లో కూర్చున్న వారినుద్దేశించి చంద్రమౌళి మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఉద్యమం చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం హేయమైన చర్య అని తెలిపారు. పబ్లిక్‌ సెక్టార్‌ ప్రాధాన్యతపై ప్రజా సంఘాలు, కార్మికులు గొంతెత్తి మాట్లాడినా ప్రభుత్వాలు చలించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయన్నారు. దీక్షల్లో సిఐటియు సీనియర్‌ నాయకులు వై.రాజు, కె.నరసింగరావు, పి.ఆదినారాయణ (బాబా), సిహెచ్‌.నాగరాజు, దాసరి అప్పారావు, కె.కలుదాస్‌, పి.రవికుమార్‌, కె.మోహనరావు, జి.పైడిరాజు పాల్గొన్నారు.

➡️