పిఠాపురంలో టిడిపి శ్రేణుల ఆందోళన

Mar 14,2024 18:34 #Dharna, #JanaSena, #Pithapuram, #TDP
  • పోస్టర్లు, ఫ్లెక్సీలు, టిడిపి జెండాలకు నిప్పు
  • జనసేనకు టికెట్‌ కేటాయింపుపై ఆగ్రహం

ప్రజాశక్తి – పిఠాపురం(కాకినాడ జిల్లా) :  కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్నట్టు చేసిన ప్రకటన టిడిపి శ్రేణుల్లో నిప్పును రాజేసింది. పవన్‌కల్యాణ్‌ ప్రకటన చేయగానే పట్టణంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్థానిక రాజు గారి కోటలో ఉన్న టిడిపి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పార్టీ ఫ్లెక్సీలు, జెండాలు, కరపత్రాలను రోడ్డుపైకి తెచ్చి కుప్పగాపోసి తగులబెట్టారు. రెండు దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ నిబద్ధతో పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మకి కాకుండా జనసేనకు టికెట్‌ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు, లోకేష్‌, నారా భువనేశ్వరి ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను చించి మంటల్లో వేశారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు మాట్లాడారు. గత ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని, ముందు ఆ స్థానాల్లో గెలిచి తర్వాత పిఠాపురం నుంచి పోటీ చేయాలని హితవు పలికారు. తమ మద్దతు వర్మకే ఉంటుందని నినదించారు.
సంయమనం పాటించాలి : వర్మ
నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ టికెట్‌ విషయంలో పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబును విమర్శించొద్దని అన్నారు. కుటుంబాన్ని, వ్యాపారాలను వదులుకుని పార్టీ కోసం రెండు దశాబ్దాలుగా పనిచేశానని తెలిపారు. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ నిత్యం ప్రజల మధ్యనే ఉన్నానని గుర్తు చేశారు. శుక్రవారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి అనంతరం నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.

➡️