పెన్షన్‌తోపాటు సందేశం లబ్దిదారులకు అందించండి -కలెక్టర్లకు సిఎం సూచన

Dec 28,2023 21:52 #ap cm jagan, #video conference

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :జవనరిలో పెంచి ఇచ్చే పెన్షనతోపాటు తాను వ్యక్తిగతంగా రాసిన లేఖను, వీడియో సందేశాన్ని కూడా లబ్దిదారులకు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక, ఆసరా, చేయూత, అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభం తదితర కార్యక్రమాలపై గురువారం క్యాంపు కార్యాలయంలో ఆయన కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరిలో మూడు, ఫిబ్రవరిలో ఒకటి మొత్తం నాలుగు ప్రధాన కార్యక్రమాలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్‌, లాంచ్‌, పోస్ట్‌లాంచ్‌ కార్యక్రమాలు ఉంటాయని అవన్నీ సక్రమంగా నడిచేలా కలెక్టర్లు చూసుకోవాలని తెలిపారు. జనవరి ఒకటోతేదీ నుండి వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక మూడువేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఎనిమిదోతేదీ వరకూ ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.400 కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేస్తే ప్రస్తుతం రూ.1950 కోట్లు ఖర్చు చేస్తున్నామని, 66 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. జనవరి 19న అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని, అలాగే ఆసరా జనవరి 23వ తేదీ నుండి 31 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి ఐదోతేదీ నుండి 14 వరకు చేయూత కొనసాగుతుందని వివరించారు. ఈ నాలుగు కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పారు. వైసిపి ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, ఉత్సాహవంతులు, ఈ కార్యక్రమంలో పాల్గనేలా చూడాలని కోరారు. ఆవ్వాతాతల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇంటి వద్దకే పెన్షన్‌ తీసుకొచ్చి ఇస్తున్నామని చెప్పారు. కేవలం పెన్షన్‌ కార్యక్రమం కోసమే రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఆసరా కోసం రూ.25,570 కోట్లు ఖర్చు చేశామని, మూడు విడతలుగా రూ.19,195 కోట్లు ఇచ్చామని, చివరి ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద రూ.6,400 కోట్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. జనవరి 22వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే అన్ని కార్యక్రమాల ద్వారా విజయగాథలను వీడియో రూపంలో చిత్రీకరించాలని, ఉత్తమమైన వాటికి సచివాలయాల స్థాయిలో రూ.10 వేలు, మండలస్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గస్థాయిలో రూ.20 వేలు, జిల్లాస్థాయిలో రూ.25 వేలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 15,16 తేఈల్లో ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు. ఆసరా కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

➡️