పిఎస్‌ఎల్‌వి-సి 58 ప్రయోగం సక్సెస్‌

  • ఈ ఏడాది మానవ రహిత గగన్‌యాన్‌ : ఇస్రో చైర్మన్‌

ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా) : తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుండి తొలి ఎక్స్‌రే పొలారిమీటర్‌ (పిఎస్‌ఎల్‌వి-సి 58) రాకెట్‌ ద్వారా ఎక్స్‌పో శాట్‌ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు కక్కుతూ సోమవారం ఉదయం 9.10 గంటలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకుపోయింది. భూమికి 650 కిలోమీటర్ల దూరంలో నిర్ణీత అంతరిక్ష కక్ష్యలోకి ఎక్స్‌పో శాట్‌ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు చేర్చారు. దీనిలోని సోలార్‌ ప్యానళ్లు విచ్చుకొని బ్యాటరీలను ఛార్జింగ్‌ చేసే పని ప్రారంభించింది. 480 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలో తిరుగుతూ ఐదేళ్లపాటు పని చేయనుంది. ప్రధానంగా ఎక్స్‌ కిరణాలపై అధ్యయనం చేయనుంది. ఇది టెలిస్కోప్‌లా అంతరక్ష రహస్యాలు ఛేదించనుంది. కేరళ విద్యార్థులు తయారు చేసిన ఐవివై అనే నానో ఉపగ్రహాన్నీ శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. నూతన సంవత్సరం రోజున ఎక్స్‌పో శాట్‌ ఉపగ్రహం ప్రయోగ విజయం ద్వారా భారత ప్రజలకు ఇస్రో బహుమతి ఇచ్చిందని ఆ సంస్థ చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పేర్కొన్నారు. ఇది భవిష్యత్తులో పరిశోధనాత్మక ప్రయోజనాలకు కీలకంగా ఉపయోగపడనుందని తెలిపారు. ఈ ఏడాదిలో పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి, ఎస్‌ఎస్‌ఎల్‌వి, 10 నుంచి 12 రాకెట్‌ ప్రయోగాలు ఉంటాయని ప్రకటించారు. మానవ రహిత గగన్‌యాన్‌ ప్రయోగమూ ఉంటుందని తెలిపారు.గవర్నర్‌, సిఎం అభినందనలుఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్త్రో శాస్త్రవేత్తలకు రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలిపారు.

➡️