ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాలపై ప్రభావం

May 5,2024 11:07 #amaravathi, #rainfall

అమరావతి: ఎండలు దంచికొడుతున్నాయి.. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. ఎండలకు తీవ్రమైన వడగాల్పులు తోడు కావడంతో.. ఏపీ ప్రజలు అల్లాడి పోతున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్ష సూచన ఉందంటోంది అమరావతి వాతావరణ కేంద్రం.. ఎల్లుండి ఏపీలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది అమరావతి వాతావరణ కేంద్రం.. ఇక, మిగతా చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని సూచించింది.. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పతున్నాయని.. ఆదివారం, సోమవారాల్లో కోస్తాంధ్ర, రాయల సీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. అయితే, ఆదివారం మాత్రం రాష్ట్రంలోని 247 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మరో వైపు.. ఇప్పటికే తిరుపతి, తిరుమల సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తిరుమలలో అయితే.. గత మూడు రోజులుగా వర్షాలు కురిస్తున్నాయి..

➡️