పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌: డబ్బు తరలించడంలో ఉన్న శ్రద్ధ.. జల వనరులను తరలించడంపై లేదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం తన్నులాటలు షురూ అయ్యిందని సాగు, తాగు నీరు లేక పల్లె ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధర చెల్లించి ట్యాంకర్లు బుక్‌ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇది ప్రకృతి కరువు కాదు.. వైఫల్యాల కాంగ్రెస్‌ సృష్టించిన కొరత ఇది. పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. చేతనైతే ముఖ్యమంత్రి ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తాలి అని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లు కాదు.. వాటర్ ట్యాప్ ల మీద దృష్టి పెట్టాలని అన్నారు. సూట్ కేసుల్లో ఢిల్లీకి డబ్బు మోసుకెళ్లడమే సీఎం రేవంత్ కు సరిపోతోందని ఆరోపించారు. మేడిగడ్డ కొట్టుకుపోయిందన్న ప్రభుత్వం గాయత్రీ, నందీ పంప్ హౌస్ లను ఎలా స్టార్ట్ చేసిందని ప్రశ్నించారు. ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి, మళ్ళీ వేరే పార్టీలో పోటీ చేయటం రాజ్యాంగ విరుద్ధమని.. దీనీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉందన్నారు. కచ్చితంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై కోర్టుకు వెళ్తామని.. ఘన్‌పూర్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక ఖాయమన్నారు.

➡️