రామచంద్రపురం ఎవరికి…?

Feb 19,2024 16:04 #JanaSena, #Konaseema
Ramachandrapuram to whom...?

మారుతున్న సమీకరణలతో అభ్యర్థుల్లో గుబులు
పట్టు బిగిస్తున్న జనసేన

ప్రజాశక్తి-రామచంద్రపురం : ఎన్నికల సమీపిస్తుండటంతో వేసవి వాతావరణంతో పాటు ఎన్నికల వాతావరణం నెమ్మదిగా వేడెక్కుతుంది. వైసీపీ టికెట్లు ఇప్పటికే ప్రకటించడంతో వారు ప్రచారానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో టిడిపి-జనసేనల కూటమి ఇంకా తర్జనభర్జన పడుతుంది. చివరిదాప సమావేశమైన రెండు పార్టీలు 90% చర్చలు పూర్తయ్యాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికల సమీపిస్తుండటంతో 26 సీట్లు కేటాయించిన జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ మరో 10 సీట్లు కేటాయించి మొత్తం 35 స్థానాలకు జనసేన అభ్యర్థులను నిలిపేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇదే సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి ఐదు స్థానాలు కేటాయించిన వారికి మరో స్థానం రామచంద్రపురం కూడా కేటాయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాజానగరం, రాజమండ్రి ,పిఠాపురం, కాకినాడ రూరల్ రాజోలు స్థానాలు జనసేన కేటాయించగా చివరి ఒప్పందంలో రామచంద్రపురం కూడా జనసేన పట్టుబట్టి ఒప్పించినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలోనూ పోటీ చేసే అభ్యర్థులలో గుబులు మొదలైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం పదిమంది ప్రయత్నాలు కొనసాగిస్తుండగా జనసేన నుండి 2019లో పోటీ చేసిన పోలిశెట్టి చంద్రశేఖర్ తో పాటు కొత్తగా రాజకీయా రంగం చేసిన చిక్కాల దొరబాబు పేర్లు తెరపైకి వచ్చాయి. చిక్కాల మాజీ మంత్రి చిక్కాల రామచంద్ర రావు తమ్ముడు కావడంతో ఆయనకు అన్న సహకారంతో అటు తెలుగుదేశంలోనూ ఇటు కాపు సామాజిక వర్గంలోనూ పట్టు బిగించి విజయకేతనం ఎగరవేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుండగా, రామచంద్రపురం టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి గా చిక్కాల దొరబాబు పేరు ఖరారు చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీనితో ఇప్పటివరకు ఈ సీటు తెలుగుదేశానికి వస్తుందన్న ఆశావాహులు ఇక తప్పని పరిస్థితుల్లో జనసేనకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈలోగా బిజెపితో చివరిసారి మంతనాలు జరుగుతున్న తెలుగుదేశం జనసేన పార్టీలు అభ్యర్థుల ప్రకటన మరో రెండు మూడు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం. అయితే బిజెపి కూటమికి ఐదు 3 ఎంపీ సీట్లు, 5 లేక 6 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ఆ పార్టీ పట్టుపడుతున్నట్లు వినికిడి. బిజెపితో ఒప్పందం కుదిరితే జనసేనకు 35 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ బిజెపితో పొత్తు కుదరకపోతే మరో ఎంపీ 5 ఎమ్మెల్యే సీట్లు జనసేనకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి మూడున ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ఎప్పటినుంచి అభ్యర్థులు ప్రసారాలకు అవసరమైన కసరత్తులను వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండగా చివరి లిస్టు కోసం ఆశవాహలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

➡️