నెల్లూరులో రెడ్‌ అలర్ట్‌

Dec 2,2023 22:34 #heavy rains, #Nellore District
  • కలెక్టరేట్‌, డివిజన్‌ కేంద్రాల్లో కంట్రోల్‌ రూం
  • అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు : కలెక్టర్‌
  • మిచాంగ్‌ తుపాన్‌ నేపథ్యంలో అప్రమత్తత

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : మిచాంగ్‌ తుపాన్‌ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని లోతట్టు రహదారులు జలమయమయ్యాయి. శివారు ప్రాంతాలైన తల్పగిరి కాలనీ, ఆర్‌టిసి కాలనీలు జలమయమయ్యాయి. మైపాడు తీరంలో సముద్ర కెరటాల ఉధృతి పెరిగింది. తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాను అధికారులు రెడ్‌అలర్ట్‌గా ప్రకటించారు. తుపాన్‌ తీరం దాటుతుందన్న నేపథ్యంలో సోమవారం విద్యా సంస్థలకు కలెక్టర్‌ హరినారాయణన్‌ సెలవులు ప్రకటించారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల మూడు నుంచి ఐదు వరకు జిల్లాపై తుపాన్‌ ప్రభావం ఉంటుందన్నారు. తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నివారించేందుకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా రెవెన్యూ, విద్యుత్‌, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, పౌర సరఫరాలు, తదితర డిపార్ట్‌మెంట్స్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కలెక్టరేట్‌, డివిజన్‌ కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. నేటి నుంచి ఐదు వరకూ చేపల వేటకు వెళ్లకుండా సముద్ర తీర ప్రాంత మత్స్యకారులను,పెన్నా నది పరీవాహక ప్రాంతంలో ఉండే మత్స్యకారులను అప్రమత్తం చేశామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రభుత్వ సిబ్బందికి ఎటువంటి సెలవులూ ఇవ్వరాదని,హెడ్‌ క్వార్టర్‌ దాటి వెళ్లరాదని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు సమన్వయంతో నిత్యావసర సరుకులు సిద్ధం చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనరేటర్లను, డీజిల్‌ను సిద్దంగా ఉంచుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాబోవు మూడు రోజులలో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు.

➡️