చిరువ్యాపారులకు ఊతం

Jan 12,2024 08:12 #ap cm jagan, #jagannanna thodu

8వ విడత జగనన్న తోడులో సిఎంబటన్‌ నొక్కి రూ.431 కోట్లు విడుదల

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :చిరువ్యాపారులకు జగనన్నతోడు ఊతమిస్తుందని, దీనికోసమే రూ.431 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎనిమిదో విడత జగనన్నతోడు కార్యక్రమాన్ని ఆయన బటన్‌నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 86,084 మంది చిరు వ్యాపారులకు రూ.86 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, వీరితోపాటు గతంలో స్కీము ద్వారా రుణాలు పొందిన 3.09 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.332 కోట్ల రుణాలను రెన్యువల్‌ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా రూ.418 కోట్లను 3.95 లక్షల మందికి ఇస్తున్నామని పేర్కొన్నారు. కట్టిన వడ్డీలు రూ.88.33 కోట్లు తిరిగి వారికే ఇస్తున్నామని పేర్కొన్నారు. వీరిలో 73,072 మంది లబ్ధిదారులు ఇప్పటికే నాలుగుసార్లు డబ్బులు కట్టి తీసుకున్నారని, అదే విధంగా 5.10 లక్షల మంది మూడుసార్లు డబ్బులు కట్టారని తెలిపారు. దీనిద్వారా చిన్న వ్యాపారులు, హస్త కళాకారులు, ఫుట్‌పాత్‌ అమ్మకాలు చేసేవారు, వీధుల్లో తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకునేవారు, రోడ్డుపక్కన టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంంత్రి బూడి ముత్యాలనాయుడు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజరుజైన్‌, సెర్ప్‌ సిఇఓ ఇంతియాజ్‌, అధికారులు మహ్మద్‌ దివాన్‌, మెప్మా ఎమ్‌డి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️