వృద్ధుడి గొంతులో నెల రోజులుగా ఉన్న ఎముక తొలగింపు

May 15,2024 08:48 #hydrabad

హైదరాబాద్‌ : తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు నెల రోజుల క్రితం ఓ వివాహ వేడుకలో మటన్‌ తింటూ పొరపాటున ఓ ఎముకను మింగేశారు. ఆహారనాళంలో ఇరుక్కుపోయిన ఆ ఎముక లోపల రంధ్రం పడి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. నెల రోజులుగా అవస్థలు పడుతున్న ఆ వృద్ధుడికి హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్‌లో ఉన్న కామినేని ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స అవసరం లేకుండానే ఆ ఎముక తొలగించి గొప్ప ఊరట కల్పించారు. ఈ మేరకు కామినేని ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. తొలుత నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండొస్కొపీ చేసి ఎముక ఉందన్న విషయాన్ని వైద్యులు గుర్తించి ఎల్బీనగర్‌ ఆస్పత్రికి పంపించారు. ఇక్కడ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ రాధిక నిట్టల వైద్య బృందం ఆయనను క్షుణ్నంగా పరిశీలించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండొస్కోపిక్‌ ప్రణాళికతోనే ఆ ఎముకను ఎంతో చాకచక్యంగా బయటకు తీశారు. దీనికి సంబంధించిన వివరాలను డాక్టర్‌ రాధిక తెలి పారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేన్‌ గ్రామానికి చెందిన 66 ఏళ్ల శ్రీరాములుకు దవడ పళ్లు లేకపోవడంతో నమలలేరు. కానీ ఒక పెళ్లికి వెళ్లి అక్కడ మటన్‌ ఉండటంతో తినాలనుకున్నారు. పళ్లు లేకపోవడం వల్ల నమలకుండా నేరుగా మింగేశారు. దీంతో 3.5 సెంటీమీటర్ల పొడవున్న ఒక ఎముక లోపలకు వెళ్లిపోయింది. రెండు మూడు రోజుల తర్వాత ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక వైద్యులకు చూపిస్తే అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ తీసి గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ అనుకొని మందులు ఇచ్చారు. కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. దాంతో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి లోపల ఎముక ఇరుక్కుందన్న విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. సాధారణంగా ఎముక ఇరుక్కుంటే ఎవరైనా తీసేస్తారు. అది నెల రోజులుగా బయటకు తీయకపోవడంతో ఆహారనాళానికి రంధ్రం చేసింది. అది కొంచెటం అటూ ఇటూ అయినా ఆహారనాళానికి పూర్తిగా రంధ్రం పడిపోవడమే కాకుండా గుండెకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అన్నం తింటే ఆ మెతుకులు మళ్లీ సంక్రమణ అయిన దగ్గర మళ్లీ ఇన్ఫెక్షన్‌ అవుతుందని రాధిక తెలిపారు. దీన్ని అత్యంత జాగ్రత్తగా ఎండోస్కొపీ ప్రొసీజర్‌లోనే తొలగించాలని వైద్యులు తెలిపారు. అప్పుడు తప్పనిసరిగా మేజర్‌ సర్జరీ చేయాలన్నారు. అందుకే ఆయనకు కొంతకాలం పూర్తిగా ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పినట్లు వైద్యులు పేర్కొన్నారు. కొబ్బరినీళ్లు, మంచినీళ్లు లాంటివి మాత్రమే తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఇలా ఒక నెల రోజులపాటు ఎముక లోపల ఉండిపోవడం ఎప్పుడూ చూడలేదని డాక్టర్‌ రాధిక అన్నారు.

➡️