దూరదర్శన్‌ శాంతిస్వరూప్‌ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

అమరావతి : దూరదర్శన్‌ మొదటి తరం న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ మృతిపై ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల నుండి శాంతి స్వరూప్‌ మార్గదర్శక ప్రయత్నం చాలామంది వార్తా ప్రసారకులకు స్పూర్తినిచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా శాంతి స్వరూప్‌ కుటుంబానికి సంతాపం తెలిపారు.

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతిస్వరూప్‌ తెలుగు ప్రజలందరికీ సుపరిచితులని, ఆయన మరణం బాధాకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. 1983 నుంచి న్యూస్‌ రీడర్‌ గా శాంతిస్వరూప్‌ తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్‌ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. శాంతిస్వరూప్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

”దూరదర్శన్‌ అంటే వార్తలు… వార్తలు అంటే శాంతిస్వరూప్‌ గారు” అన్నంతగా తెలుగు వీక్షకులకు దగ్గరైన శాంతిస్వరూప్‌ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని టిడిపి నేత లోకేశ్‌ అన్నారు. శాంతిస్వరూప్‌ కి కన్నీటి నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్‌ చేశారు. శాంతిస్వరూప్‌ మఅతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

➡️