రూ.26 లక్షల నగదు స్వాధీనం – బంగారు ఆభరణాలు సీజ్‌

Apr 8,2024 07:25 #eluru, #gold jewelery seized

ప్రజాశక్తి-యంత్రాంగం :రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది భారీగా నగదు పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసుల ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడుతున్నారు. అధిక మొత్తంలో తరలిస్తున్న డబ్బు, నగలను స్వాధీనం చేస్తున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్‌ చేస్తున్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎపిఎస్‌ఆర్‌టిసి కార్గో సర్వీసు వాహనంలో డ్రై ఫ్రూట్స్‌ పెట్టెల మధ్య తరలిస్తున్న రూ.22.63 లక్షల నగదును ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న ఆర్‌టిసి కార్గో వాహనం పట్టణంలోకి ప్రవేశిస్తుండగా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో డ్రైఫ్రూట్స్‌ పెట్టెల మధ్య నగదు ఉంచి తరలిస్తుండటాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో సీజ్‌ చేసినట్లు జంగారెడ్డిగూడెం డిఎస్‌పి రవిచంద్ర తెలిపారు. ఏలూరు శివారు తంగెళ్లమూడి వద్ద ఓ కారులో తరలిస్తున్న సుమారు రూ.3.66 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బాపట్ల జిల్లా మార్టురులో ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న వెండి, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వలపర్ల గ్రామానికి చెందిన బంగారు వ్యాపారి కొల్లిపర నాగసుపేరావు తన ద్విచక్ర వాహనంలో రూ.9 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలను తీసుకెళ్తుండగా మార్టూరులో పోలీసులు పట్టుకున్నారు. వీటికి సంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నామని సిఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

➡️