అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోండి -సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్‌డిఎ కూటమి అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రాల వద్ద లోపల, బయట అల్లర్లకు కుట్రలు చేస్తున్నట్లు తమకు సమాచారం వుందని, ఎన్నికల కమిషన్‌ పకడ్బంధీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టిడిపి ఎన్నికల ఏజెంట్ల ద్వారా పోలింగ్‌ కేంద్రాల్లో అల్లర్లకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అలాగే ఎన్నికల నిబంధనావళిని చంద్రబాబు ఉల్లంఘించారని, ఆయనపై ఇసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను వైసిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్‌ రెడ్డి, గ్రీవెన్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు అంకంరెడ్డి నారాయణ మూర్తి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు 230 ఫిర్యాదులు ఇచ్చినా స్పందించని ఎన్నికల కమిషన్‌ టిడిపి ఏ చిన్న ఫిర్యాదు చేసినా ఎలాంటి కారణాలు లేకుండా చర్యలు తీసుకుంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

➡️