సచివాలయాలు దేశానికే ఆదర్శం

-ప్రతి సచివాలయ పరిధిలో రూ.50 కోట్ల మేర అభివృద్ధి పనులు
-ప్రజల సహకారంతో ముందుకెళ్తా
-తుగ్గలి ‘ముఖాముఖి’లో ముఖ్యమంత్రి జగన్‌
-కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ‘మేమంతా సిద్ధం’ బస్‌ యాత్ర
ప్రజాశక్తి-యంత్రాంగం :గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన సచివాలయాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో రూ.50 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బస్‌ యాత్ర నిర్వహించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన, తుగ్గలి, జన్నగిరి, ఎర్రగుడి తదితర గ్రామాల మీదుగా సాగింది. అనంతపురం జిల్లాలో ఎటువంటి ప్రసంగాలూ లేకుండా యాత్రను కొనసాగించారు. తుగ్గలిలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి కుమారులు ప్రతాపరెడ్డి, ప్రహల్లాదరెడ్డి చిత్రపటాలకు ముఖ్యమంత్రి జగన్‌ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తుగ్గలిలో నవరత్నాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సచివాలయం వ్యవస్థ ద్వారా అన్ని గ్రామాలూ అభివృద్ధి చెందాయన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా 58 నెలల్లో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా 1,35,819 శాశ్వత ఉద్యోగాలను కల్పించామని, రాష్ట్ర వ్యాప్తంగా 2.26 లక్షల మంది వలంటీర్లను నియమించి వారి ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని వివరించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులకూ గురి కాకుండా ఉండేందుకు గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా తుగ్గలి గ్రామానికి చెందిన ఎలాజీబెత్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పథకాలు అందిస్తే ప్రజలు ముఖ్యమంత్రిగా మళ్లీ మిమ్మల్ని చూస్తారని అన్నారు.
రైతులకు రుణమాఫీ చేయాలి : శ్యామల, రాతన గ్రామం
వర్షాభావ పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఆదుకోవడానికి రుణమాఫీ చేయాలని తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన శ్యామల ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వర్షం పడితే తప్ప పంటలు చేతికి రావడం లేదని, పంటలు పండక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిఎం దృష్టికి తీసుకెళ్లారు.
తుగ్గలిని కరువు మండలంగా ప్రకటించలేదు : సూరన్న
నిత్యం కరువుతో అల్లాడుతున్న తుగ్గలి మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించలేదని, దీంతో, రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. చెరువులను నీటితో నింపకపోవడంతో తుగ్గలి మండల ప్రజలు తాగు నీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని సిఎం దృష్టికి తీసుకెళ్లారు.
వైసిపిలో చేరిన టిడిపి కల్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు
ముఖ్యమంత్రి సమక్షంలో గుత్తి మండలం బసినేపల్లి గ్రామం వద్ద అనంతపురం జిల్లా వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున వైసిపిలో చేరారు. వారిలో కల్యాణదుర్గం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఉన్నారు. ఆయన టిడిపి టికెట్‌ ఆశించారు. ఆ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో తన మద్దతుదారులతో కలిసి వైసిపిలో చేరారు.
ప్రసంగం లేకుండా అనంతపురం జిల్లాలో యాత్ర
కర్నూలు జిల్లా తుగ్గలిలో శనివారం ఉదయం ప్రారంభమైన యాత్ర సాయంత్రానికి అనంతపురం జిల్లాకు చేరుకుంది. గుత్తి పట్టణంలో జరిగిన రోడ్‌ షోలో పెద్ద ఎత్తున జనం జగన్‌కు మద్దతుగా కదిలారు. పామిడి, గార్లదిన్నె మీదుగా రాప్తాడు వరకు యాత్ర సాగింది. దారి పొడవునా వందలాది మంది వైసిపి నాయకులు, కార్యకర్తలు జెండాలను చేతపట్టుకుని ఆయన వెంట కదిలారు. అనంతపురం రూరల్‌ మండలం కృష్ణంరెడ్డిపల్లి వద్ద జగన్‌ రాత్రి బస చేశారు. మొదటి రోజు అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్‌ షోలో ఎక్కడా ప్రసంగాలు లేకుండానే యాత్ర సాగింది. అక్కడక్కడా వృద్ధులు, పిల్లలతో జగన్‌ మాట్లాడారు.

➡️