‘స్టీల్‌’ భూములు సేల్‌ చేయండి

-విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలకు మఖ్యమంత్రి ఉచిత సలహా
-స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు నిర్దిష్ట హామీ ఇవ్వని వైనం
-కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ససేమిరా
-బిజెపికి వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గిపోవాలని దేవున్ని ప్రార్థించండి అంటూ సూచన
ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో:’స్టీల్‌ భూములు సేల్‌ చేయండి… లేదంటే దేశంలో వచ్చే ఎన్నికల్లో బిజెపికి 230 నుంచి 240 సీట్లు మాత్రమే రావాలని దేవుణ్ణి ప్రార్థించండి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో అన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ సమస్యలపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మంగళవారం విశాఖలోని ఎంవివి సిటీలో సిఎం జగన్‌ను కలిశారు. 15 నిమిషాలకుపైగా చర్చించినా సిఎం ఏ ఒక్క సమస్యపైనా నిర్ధిష్ట హామీ ఇవ్వలేదు. స్టీల్‌ప్లాంట్‌ సమస్యలను వివరించాలని వెళ్లిన ఉక్కు నేతలు… భూములు అమ్ముకోవాలని ముఖ్యమంత్రి ఇచ్చిన సలహాతో అవాక్కయ్యారు. ప్రైవేటీకరణ అంశంపైనేగాక విద్యుత్‌ బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు ఇచ్చిన లీజుల పునరుద్ధరణ, విద్యుత్‌ బకాయిలపై సమయం ఇవ్వాలని పోరాట కమిటీ నేతలు చేసిన సూచనలపై సిఎం జగన్‌ చేతులెత్తేశారు.
ఏ ఒక్క సమస్యపైనా సిఎం నిర్ధిష్ట హామీ ఇవ్వలేదు : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, ఇతర సమస్యలపై సిఎంతో చర్చించగా ఏ ఒక్క సమస్యపైనా నిర్ధిష్ట హామీ ఇవ్వలేదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ముడి ఖనిజం లేకుండా చేసి, ఉత్పత్తిని తగ్గించి, కంపెనీని నష్టాల్లోకి నెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీన్ని అడ్డుకోవాలని పోరాట కమిటీ సిఎం జగన్‌ను కోరిందని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 230 నుంచి 240 సీట్లు కంటే దాటకూడదని అందరూ దేవున్ని ప్రార్థించాలని ఉచిత సలహా ఇచ్చారని, ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ ఆపడానికి స్టీల్‌ భూములు అమ్మి అప్పులు తీర్చడం ఒక్కటే పరిష్కారమని తప్పుడు పరిష్కార మార్గం సూచించారని తెలిపారు. భూములు అమ్మడం పరిష్కారం కాదని, సొంత గనులు కేటాయించడం ఒక్కటే సరైన పరిష్కారమని గతంలోనే పోరాట కమిటీ తెలియజేసిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించాల్సిన మైనింగ్‌ లీజులను సంవత్సరానికిపైగా పునరుద్ధరణ చేయలేదని తెలిపారు. దీనికి సైతం సిఎం స్పష్టమైన హామీ ఇవ్వలేదని వివరించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం గర్భాంలో మాంగనీస్‌ ఖనిజం, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో క్వార్ట్జ్‌, సరిపల్లిలో ఇసుకకు సంబంధించి గతంలో ఉన్న లీజులను ఏడాది కాలంగా పునరుద్ధరించకపోవడంతో ఆ ఖనిజాలను స్టీల్‌ప్లాంట్‌ బయట నుంచి కొనుగోలు చేస్తోందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఈ లీజులను వెంటనే పునరుద్ధరించాలని కోరామని పోరాట కమిటీ నాయకులు నేతలు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉత్పత్తవుతున్న విద్యుత్‌ సరిపోక అదనంగా డిస్కముల నుంచి తీసుకున్న రూ.90 కోట్లు విద్యుత్‌ ఛార్జీలను వెంటనే చెల్లించాలని, లేదంటే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఇచ్చిన నోటీసులను నిలిపివేయించి విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి కొంత సమయం ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికీ సిఎం నుంచి సరైన సమాధానం రాలేదని చెప్పారు. విద్యుత్‌ పంపిణీ, ట్రాన్స్‌మిషన్‌ విభాగాలు సుమారు రూ.లక్ష కోట్లు అప్పుల్లో ఉన్నందున విద్యుత్‌ బిల్లుల చెల్లింపునకు వెసులుబాటు కల్పించలేమని సిఎం చెప్పడం విడ్డూరంగా ఉందని నేతలు మీడియాకు తెలిపారు. సిఎంను కలిసిన వారిలో పోరాట కమిటీ చైౖర్మన్లు సిహెచ్‌.నరసింగరావు, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కెవిడి.ప్రసాద్‌ ఉన్నారు. సుమారు ఏడాది కాలంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌తో చర్చించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అనేకసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎన్నికల నేపథ్యంలో సిఎం జగన్‌ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధి బృందానికి కబురు పెట్టడంతో నాయకులు వెళ్లి కలిశారు.

➡️