ఆందోళనలు .. పోరాటాలు 

Dec 28,2023 09:48 #SFI
ఎస్‌ఎఫ్‌ఐ

 

జిల్లాలవారీ చర్చల్లో అనుభవాలు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ పెట్టిన నివేదికపై వివిధ జిల్లా నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా నుంచి పవన్‌కుమార్‌ మాట్లాడుతూ.. హిందూపురం గ్రామీణ విద్యార్థులకు బడి బస్సులు నడపాలని, 1000 మంది విద్యార్థులతో ఆర్‌టిసి డిపో వద్ద ధర్నా చేశామని దాని ఫలితంగా ఆర్‌టిసి బస్సులు వేశారన్నారు. తలుపుల మండలంలో జూనియర్‌ కళాశాలలో విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన లెక్చలర్‌కు దేహశుద్ధి చేశామన్నారు. ఏలూరు జిల్లా నుంచి దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ.. నూజివీడులో త్రిపుల్‌ ఐటి కళాశాల విద్యార్థి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో నిర్వహించిన ఆందోళనలో విజయం సాధించామన్నారు. ప్రకాశం జిల్లా నుంచి వినోద్‌ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టల్‌ సమస్యలపై పోరాటాలు చేస్తున్నామని వివరించారు. కడప జిల్లా నుంచి సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో స్థానిక సమస్యల మీద కేంద్రీకరించి పని చేస్తున్నామని తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా నుంచి సాగర్‌ మాట్లాడుతూ.. వరదల సమయంలో కేవలం ఒక్క రోజులోనే రూ. 98 వేలు వసూలు చేసి వరద బాధితులకు అందించామన్నారు. విజయనగరం జిల్లా నుంచి రవి, కళ్యాణి మాట్లాడుతూ.. విద్యారంగంలో నూతన మార్పుల వల్ల పాఠశాలలను విలీనం చేయడంతో వేలాదిమంది విద్యార్థులు చదువులకు దూరం అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిపామన్నారు. సైకిల్‌ యాత్ర ద్వారా అనేక సమస్యలను గుర్తించమన్నారు. హాస్టల్లో సమస్యలపై నిరవధిక నిరాహార దీక్షలకు కూర్చున్నామని, అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు. విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంలో క్షతగాత్రులకు 15 మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు రక్తదానం చేశామని వివరించారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి హరీష్‌ మాట్లాడుతూ.. నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశామన్నారు. ఎచ్చెర్ల మండలంలో బాలయోగి గురుకులంలో విద్యార్థి మృతిపై నాలుగు గంటల పాటు ధర్నా చేసి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించామని వివరించారు. కాకినాడ జిల్లా నుంచి సాహిత్‌, శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. మణిపూర్‌ ఘటనకు వ్యతిరేకంగా 300 మందితో నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. కాకినాడ పీజీ సెంటర్లో అధికార పార్టీ నేతలు స్థలాన్ని కబ్జా చేస్తుంటే అడ్డుకున్నామని తెలిపారు. అన్నమయ్య జిల్లా నుంచి నరసింహ మాట్లాడుతూ… ఒక ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని గాయపడగా సంబంధిత యాజమాన్యంపై చర్యలకు ఆందోళన చేపట్టామని, రూ. రెండు లక్షల జరిమానా విధించేలా పోరాటం జరిపామన్నారు.

కృష్ణా జిల్లా నుంచి సమరం మాట్లాడుతూ… కృష్ణ యూనివర్సిటీ హాస్టల్‌లో భవనాలు లేక పలువురు విద్యార్థులు ప్రయివేటు వసతి గృహాలను ఆశ్రయిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులు విద్యుత్‌ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారన్నారు. వారికి నష్టపరిహారం ఇప్పించేలా పోరాటాలు జరిపామన్నారు. గన్నవరం పాలిటెక్నిక్‌ కళాశాల ఎదురుగా మద్యం దుకాణం నడుపుతుండగా ఎస్‌ఎఫ్‌ఐగా ఆందోళన చేసి ఆ దుకాణాన్ని మూయించామని తెలిపారు.

  • రంగాల వారీగా చర్చలు

వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు రంగాల వారీగా కూర్చుని చర్చలు జరిపారు. హాస్టల్స్‌, సిఎస్‌ఎన్‌, విద్యార్థినులు, యూనివర్సిటీలు, సభ్యత్వం, గిరిజన, సాంస్కృతిక రంగం, సోషల్‌ మీడియా, రాజకీయ విద్య, కేంద్రీకరించని కాలేజీలు, కమిటీలు రంగాలకు సంబంధించిన చర్చలు జరిగాయి. అనంతరం రంగాల వారీగా చర్చల్లో వచ్చిన అంశాలపై ప్రతినిధులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

➡️