మామపై అల్లుడు యాసిడ్‌ దాడి

  • చికిత్స పొందుతూ మామ మృతి

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌ (ఏలూరు) : ఆరుబయట నిద్రిస్తున్న మావయ్యపై అల్లుడు యాసిడ్‌తో దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మామ మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కవరానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు (60)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తన పెద్ద కుమార్తెను టి నర్సాపురం మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ రమేష్‌కు ఇచ్చి వివాహం చేశాడు. రమేష్‌ తన భార్యను తరచూ వేధింపులకు గురి చేసేవాడు. రమేష్‌ను నాగేశ్వరరావు మందలించేవారు. దీంతో కక్షపెంచుకున్న రమేష్‌ ఆదివారం అర్ధరాత్రి మావయ్య ఇంటికి వచ్చి ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న నాగేశ్వరరావుపై వాటర్‌ మిక్స్‌డ్‌ యాసిడ్‌ పోశాడు. నాగేశ్వరరావు కేకలు వేయడంతో అల్లుడు అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరులోని ప్రభుత్వ సర్వజనని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం నాగేశ్వరరావు మృతి చెందారు. లక్కవరం పోలీసులు కేసు నమోదు చేసి పరారైన రమేష్‌ కోసం గాలిస్తున్నారు.

➡️