ఎపికి పదేళ్లు ప్రత్యేక హోదా

May 12,2024 08:06 #Rahul Gandhi, #speech
  • వైఎస్‌ షర్మిలను గెలిపించండి : కడప సభలో రాహుల్‌ గాంధీ

ప్రజాశక్తి- కడప ప్రతినిధి : ఎన్నికల్లో ఇండియా వేదికను గెలిపిస్తే రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. కడపలోని పుత్తా ఎస్టేట్‌లో శనివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన సమయంలో రాష్ట్రానికి బిజెపి ఎన్నో హామీలు ఇచ్చిందని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారా? పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చారా? కడప స్టీల్‌ ప్లాంట్‌ను కట్టారా? ‘ అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా వేదిక తరఫున కాంగ్రెస్‌ పార్టీ నుంచి కడప ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. 2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఉంటే అన్ని హామీలూ నెరవేరేవన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా వేదికను గెలిపిస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తామని, కడప జిల్లాలో ఉక్కు ప్రాజెక్టును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇవిగాక, ప్రతి కుటుంబం నుంచి పేద మహిళను గుర్తించి ఏటా ఆమె ఖాతాలో నెలకు రూ.8,500 చొప్పున ఏడాదిలో రూ.లక్ష జమ చేస్తామన్నారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తామని, రూ.రెండు లక్షల మేర రైతు రుణాలు మాఫీ చేస్తామని, ఏటా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉపాధి హామీ కూలిని రూ.400కు పెంచుతామని, కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. బిజెపి, ప్రధాని మోడీలతో రాజ్యాంగానికి ప్రమాదం పొంచిఉందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తోందని చెప్పారు. బిజెపి అంటే బాబు, జగన్‌, పవన్‌ అని వివరించారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్‌, చంద్రబాబులకు మోడీని ప్రశ్నించే ధైర్యం లేదని అన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనకు కాలం చెల్లిందన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని ఆకాక్షించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని సమర్థించిన టిడిపి, వైసిపి తోడుదొంగలని విమర్శించారు. కడప ఎంపి అభ్యర్థి, పిసిసి అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల మాట్లాడుతూ పదేళ్లుగా రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్న బిజెపికి చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు. సింగపూర్‌ లాంటి రాజధానిని నిర్మిస్తామంటూ చంద్రబాబు, మూడు రాజధానులంటూ వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు. వివేకా హంతకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంటబెట్టుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. బహిరంగ సభకు ముందు ఇడుపులపాయకు రాహుల్‌, షర్మిల వెళ్లి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. సభలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె.శివకుమార్‌, మాణిక్యం ఠాగూర్‌, కెవిపి రామచంద్రరావు, పిసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్‌, మాజీ మంత్రి అహ్మదుల్లా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఓబులేసు, సిపిఎం వైఎస్‌ఆర్‌ జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, కడప, అన్నమయ్య జిల్లాల పార్లమెంట్‌, అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థులు పాల్గన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సభకు తరలివచ్చారు.

➡️