ఎస్‌టి ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలి.. బెంతొరియాల ర్యాలీ

Jan 1,2024 20:13 #Benthoria rally, #sc st

ప్రజాశక్తి – కవిటి (శ్రీకాకుళం):ఎస్‌టి ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కవిటి కొత్తూరు పెట్రోల్‌ బంకు నుంచి కవిటి బస్టాండ్‌ కూడలిలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు బెంతొరియాలు సోమవారం ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం అనంతరం తహశీల్దార్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ టి.రామచంద్రరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బెంతొరియా ప్రతినిధులు రజనీకుమార్‌ దొలై, దేవరాజ్‌సాహు, శివ బిశాయి మాట్లాడారు. బెంతొయాలకు 1973 నుంచి 2003 వరకు ఎస్‌టి ధ్రువీకరణ పత్రం మంజూరు చేసేవారని తెలిపారు. 2004 నుంచి నిలిపివేయడంతో గుర్తింపు లేని తరగతిగా మిగిలిన బెంతొరియా విద్యార్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్యను పరిష్కరించాలని అటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులను ఎన్నోసార్లు వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తమకు న్యాయం చేసే వరకు రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు తదితర రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బెంతొరియాలకు జనసేన ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాసరి రాజు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బెంతొరియా ప్రతినిధులు సుమన్‌ బిసాయి, దుదిస్టి మజ్జి, శంకర్‌సాహు, కృష్ణ బిసాయి తదితరులు పాల్గొన్నారు.

➡️