ఘర్షణలో వ్యక్తి మృతి

May 26,2024 21:06 #Anantapuram District, #died

ప్రజాశక్తి – నార్పల : స్థలం విషయంలో ఘర్షణపడుతున్న ఇద్దరిలో ఒకరు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా నార్పల మండల పరిధిలోని జంగం రెడ్డిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మృతుని బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొవ్వూరు లక్ష్మీనారాయణ రెడ్డి (56) తన పొలంలో చీనీ పంట సాగు చేస్తున్నారు. పంటకు నీరు సరిపోవడంలేదని పొలానికి దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న దుగుమర్రి చెరువు వద్ద నాలుగురోజుల క్రితం బోరుబావిని తవ్వించారు. అందులో నీరు పుష్కలంగా లభించడంతో మోటరు ఏర్పాటు చేసి పైల్‌లైన్‌ పనులను ఆదివారం చేపట్టారు. అదే సమయంలో తుంపెర మిద్దెల గ్రామానికి చెందిన మంజుల రమణ ఈ స్థలం తనదంటూ పైప్‌లైన్‌ పనులకు అడ్డుపడ్డాడు. ఇది ప్రభుత్వ భూమి అని లక్ష్మీనారాయణరెడ్డి సమాధానమిచ్చాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగి ఘర్షణకు దారితీశాయి. ఈ సమయంలో జరిగిన తోపులాటలో లక్ష్మినారాయణరెడ్డి కిందపడి స్పృహతప్పారు. వెంటనే నార్పల ప్రభుత్వాస్పతికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సిఐ శ్రీధర్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి తమ సిబ్బందితో ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని కుమారుడు కుల్లాయి రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని డిఎస్‌పి వెంకటశివారెడ్డి తెలిపారు.

➡️