పిల్లలకు పుస్తకాలను పరిచయం చేయాలి

tanikela dharani on vijayawada book festival
  • సినీ నటులు తనికెళ్ల భరణి

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : చూడడం నుంచి చదవడంవైపునకు పిల్లలను మళ్లించాల్సిన బాధ్యత పెద్దలకు ఉందని కవి, రచయిత, నటుడు తనికెళ్ల భరణి అన్నారు. విజయ వాడలో నిర్వహిస్తున్న 34వ పుస్తకమహోత్సవం ఆదివారంతో ముగిసింది. ముగింపు సభలో తనికెళ్ల భరణి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మన పూర్వీకులు మనకు అపారమైన సాహిత్య నిధి ఇచ్చి వెళ్లారన్నారు. అక్షరం అంటే నాశనం లేనిదని గుర్తు చేశారు. పుస్తకంలోని ఒక పేజీ తీస్తే ప్రపంచానికి ఒక కొత్త కిటికీ తీసినట్లేనన్నారు. కొత్త తరానికి పుస్తకాలను, సాహిత్య విలువలను పరిచయం చేయడంలో పుస్తకమహోత్సవం పోషిస్తున్న పాత్ర ఆనందదాయకమన్నారు. ప్రపంచంలో మొబైల్‌ వ్యాధిగ్రస్తులు కాకుండా పిల్లలను కాపాడుకు నేందుకు పుస్తకాలను పరిచయం చేయాలని సూచించారు. పుస్తకాలతో స్నేహం దీర్ఘకాలిక ఆనందాన్నిచ్చే శాశ్వతబంధమని తెలిపారు. చదువు పట్ల ఆసక్తి కలిగించేందుకు జీవిత చరిత్రలు చదవడం ఉపకరిస్తుందన్నారు. ‘అనుభవాలు-జ్ఞాపకాలూ’, ‘నా జీవనయానం’, ‘హంపీ నుంచి హరప్పా దాకా’ పుస్తకాలు చదవడం ద్వారా తెలుగునేల మూడు ప్రధాన భాగాల సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకోవచ్చని చెప్పారు. సాహిత్యం వ్యక్తులకు రసస్ఫూర్తినిచ్చే రోజుల నుంచి సామాన్యుల కష్టాలను ప్రతిఫలించే రోజులకు మారిందన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్‌ సిఇఒ ఇంతియాజ్‌, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌, పుస్తక మహోత్సవ సంఘం గౌరవాధ్యక్షులు బెల్లపుబాబ్జీ, గోళ్ల నారాయణరావు సభలో పాల్గొన్నారు. బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ కార్యదర్శి కె.లక్ష్మయ్య వందన సమర్పణ చేశారు.

➡️