బిజెపి అండతో టిడిపి అరాచకం

-ఎన్నికల కమిషన్‌ తీరు ఏకపక్షం
– సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కేంద్ర బిజెపి ప్రభుత్వ సహకారంతో టిడిపి రెచ్చిపోయిందని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పొత్తు కుదుర్చున్న రోజు నుంచి పోలింగ్‌ రోజు వరకు అధికారులను భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు. అయినా ప్రజలు జగన్‌ను విశ్వసించి పెద్దయెత్తున ఓటింగ్‌కు వచ్చారని పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరికి ఓటు వేయాలనే అంశంపై ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారన్నారు. అందుకే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి పోలింగ్‌లో భయభ్రాంతులు సృష్టించేందుకు టిడిపి కుట్రలు చేసిందని విమర్శించారు. అలాగే లేని టైట్లింగ్‌ యాక్టును తెచ్చి అబద్ధాలతో కుట్రలు పన్నిందన్నారు. చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో టిడిపి నేతలు ఈ అరాచక కాండను ప్రారంభించారని ఆరోపించారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద టిడిపి కార్యకర్తలు, గూండాలు రెచ్చిపోయి దాడులు చేశారని అన్నారు. అద్దంకి, పీలేరు, సత్తెనపల్లి, నర్సారావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో హింసాకాండకు దిగారన్నారు. పలు బూత్‌లలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. ఇవిఎంలను ధ్వంసం చేశారని ఆరోపించారు. నర్సారావుపేటలో తమ పార్టీ ఎమ్మెల్యేపై దాడికి తెగబడ్డారని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో టిడిపి చేసిన అరాచకాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా సరిగ్గా స్పందించలేదని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరించిందని అన్నారు.

➡️