రాజ్యసభ బరిలో టిడిపి ?

Jan 13,2024 10:13 #Rajya Sabha, #TDP
  • అసంతృప్తులతో వైసిపికి కష్టకాలం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగడానికి సిద్ధపడుతు న్నట్లు తెలిసింది. సంఖ్యాబలం ప్రకారం టిడిపికి ఒక్కస్థానాన్ని కూడా గెలిచే అవకాశం లేకపోయినప్ప టికీ, వైసిపిలో పెరుగుతున్న అసంతృప్తి తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. దీంతో కనీసం ఒకరిని, వీలైతే మరొకరిని కూడా రాజ్యసభ ఎన్నికల బరిలోకి దింపాలని టిడిపి భావిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభకు రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న టిడిపికి చెందిన కనకమేడల రవీంద్రకుమార్‌, సిఎం రమేష్‌ (ప్రస్తుతం బిజెపి), వైసిపికి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో ఆ స్థానాలకు ఏప్రిల్‌ లోపు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం అసెంబ్లీలో పార్టీల వారీగా వున్న బలాబలాలను చూస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 151, తెలుగుదేశంకు 23 స్థానాలు వున్నాయి. అసెంబ్లీ బలబలాలను పరిశీలిస్తే మూడు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ సునాయాసంగా గెలిచే అవకాశం వుంది. అయితే సాధారణ ఎన్నికల్లో విజయం కోసం వైసిపి సిట్టింగ్‌లను మార్చేందుకు తీవ్రమైన కసరత్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే 59 స్థానాలకు అభ్యర్థులను మారుస్తూ వైసిపి అధిష్టానం మూడు విడతలుగా జాబితాలను విడుదల చేసింది. మరికొంత మందిని మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో అవకాశం దక్కని సిట్టింగ్‌లు అవమానంతో రగిలిపోతున్నారు. బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసిపిలో నెలకొన్న అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలుగుదేశం ఎత్తుగడలను సిద్దం చేసుకుంటున్నట్లు తెలిసింది. వీరిలో కొందరితో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మంది టిడిపిలో చేరడంతో 2019 ఎన్నికలకు ముందు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మొదట టిడిపి మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆర్థికంగా బలమైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని వైసిపి రంగంలోకి దించడంతో తెలుగుదేశం మూడో అభ్యర్థిని పోటీకి పెట్టకపోవడంతో నాడు మూడు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చేయాలని టిడిపి భావిస్తోంది. టిడిపి నుండి 23 మంది మాత్రమే గెలుపొందినా, అందులో నలుగురు పార్టీని వీడి వైసిపిలో చేరారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నుండి నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి అనుకూలంగా వ్యవహరించడంతో ఆపార్టీ వారిని సస్పెండ్‌ చేసింది. తెలుగుదేశం నుంచి తమ పార్టీలోకి వచ్చిన ఇద్దరికి వైసిపి టికెట్ల కేటాయింపులో మొండిచెయ్యి చూపడంతో వారు ఆగ్రహంగా వున్నారు. వైసిపిలో సీట్లు రాని కొందరు ఎమ్మెల్యేలు దీనిని అన్ని విధాలా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. కోటి నుండి రెండు కోట్ల వరకు ఒక్కో ఎమ్మెల్యే డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. సిట్టింగ్‌లలో సీట్లు దక్కని వారితో తెలుగుదేశం టచ్‌లోకి పోతే రాజ్యసభలో మూడో సీట్‌ కష్టమేనని వైసిపి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

➡️