మోడీది ప్రచారార్భాటం

Feb 26,2024 20:40 #aims, #cpm v srinivasarao, #PM Modi
  • ఎప్పుడో ప్రారంభమైన ఎయిమ్స్‌కు ప్రధాని ప్రారంభోత్సవం
  • బిజెపితో పొత్తులో రాష్ట్ర ప్రయోజనాలేమున్నాయో టిడిపి చెప్పాలి : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీది అంతా ప్రచారార్భాటమే తప్ప, రాష్ట్రానికి చేసిందేమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. 2019లోనే మంగళగిరిలోని ఎయిమ్స్‌ ప్రారంభమై వైద్య సేవలందుతున్నాయని తెలిపారు. దానికి ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించి రాష్ట్రానికి ఏదో చేసినట్టు ఎన్నికల ముందు ప్రచారం చేసుకుంటున్నారని మర్శించారు. అనంతపురంలోని గణేనాయక్‌ భవనంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. ఎయిమ్స్‌కు రూ.1,600 కోట్ల నిధులు అవసరం కాగా, రూ.420 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఖర్చు పెట్టారని తెలిపారు. అక్కడ సిబ్బంది తక్కువగా ఉన్నా మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. తామేదో చేసినట్టు చెప్పుకునేందుకు ప్రారంభమైన దానికి మరోమారు ప్రారంభోత్సవం చేయడం శోచనీయమన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని, అన్ని విధాలా కేంద్రం మోసం చేసిందని గుర్తు చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఇప్పటి నాలుగుసార్లు శంకుస్థాపనలు చేశారు తప్ప, పనులు ముందుకు జరగలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి… జందాల్‌ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి శంకుస్థాపన చేశారన్నారు. అది కూడా ముందుకు సాగలేదని వివరించారు. అంతకు మునుపు కడప ఉక్కు పరిశ్రమ కోసం కేటాయించిన ఓబుళాపురం గనులను ఇప్పుడు జిందాల్‌ సంస్థకు కేటాయించారని తెలిపారు. ముందు నుంచి అడుగుతున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇప్పటి వరకు గనులు కేటాయించలేదన్నారు. వైద్య రంగానికి జిడిపిలో 2.57 శాతం కేటాయించాలని అనేక నివేదికలు చెబుతున్నా 0.57 శాతమే కేటాయించారని తెలిపారు. దీనివల్ల ప్రజలపై వైద్య ఖర్చుల భారం పెరుగుతోందన్నారు. 76 శాతం వైద్య ఖర్చులను ప్రజలే సొంతంగా భరించాల్సి వస్తోందని తెలిపారు. ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తోందన్నారు. ఐదు దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం లేదని వివరించారు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించడంపై చూపుతున్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రం బిజెపి చూపడం లేదన్నారు. ఎన్నికల సమయంలో మతోన్మాదాన్ని పెంచే విధంగా మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మొన్నటి వరకు శ్రీరాముడి పేరుతో రాజకీయం చేశారని, ఇప్పుడు శ్రీ కృష్ణుడు, పరమేశ్వరుడు పేరుతో రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి బిజెపితో టిడిపి జతకడుతోందని విమర్శించారు. అమిత్‌ షాతో చంద్రబాబు జరిపిన రహస్య చర్చలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. వారి చర్చల్లో రాష్ట్ర ప్రయోజనాలేమున్నాయో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌, వామపక్షాలతోపాటు కలిసొచ్చే లౌకిక పార్టీలతో కలసి పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, జిల్లా నాయకులు నల్లప్ప, బాలరంగయ్య, రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు పాల్గొన్నారు.

➡️