ఉప్పల్‌ స్టేడియంలో టీమిండియా-ఇంగ్లండ్‌ తొలి టెస్ట్‌ – స్టూడెంట్స్ కి ఫ్రీ

తెలంగాణ : టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు భారత్‌ పర్యటనకు రానుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో టీమిండియా-ఇంగ్లండ్‌ తొలి టెస్టు జరగనుంది. కాగా, ఈ మ్యాచ్‌ కు తెలంగాణలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌.సి.ఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు ఈరోజు ఉప్పల్‌ స్టేడియం ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు మ్యాచ్‌ ను చూడటానికి 6వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులను ఉచితంగా అనుమతిస్తామని తెలిపారు. అయితే, విద్యార్థులకు నేరుగా అనుమతి ఉండదని, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ దరఖాస్తులు పంపించాల్సి ఉంటుందని తెలిపారు. తమ పాఠశాల నుంచి ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు ? ఎంతమంది సిబ్బంది వస్తున్నారు ? అనే వివరాలను ప్రిన్సిపాల్స్‌ దరఖాస్తుల్లో స్పష్టంగా పేర్కొనాలని వివరించారు. తాము ఆ దరఖాస్తులను పరిశీలించి స్కూళ్లకు కాంప్లిమెంటరీ పాసులు పంపిస్తామని హెచ్‌.సి.ఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రావు వివరించారు. కాంప్లిమెంటరీ పాసులతో వచ్చే విద్యార్థులు స్కూలు యూనిఫాం ధరించి రావాలని, విద్యార్థులకు ఉచితంగా భోజనం, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

➡️