ఉపాధ్యాయులకు సాంకేతిక శిక్షణ

Dec 3,2023 09:55 #Teachers, #Technical training
  • కంప్యూటర్‌ కోర్సు చదివే విద్యార్థులతో తరగతులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కంప్యూటర్‌ కోర్సు చదువుతున్న విద్యార్ధులతో ఈ శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖ సిద్ధం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరేక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌(ఐఎఫ్‌పి)ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటు 8వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు, వారికి బోధించే ఉపాధ్యాయులకు బైజూస్‌ ట్యాబ్‌లను అందించింది. సుమారు 6వేల ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్‌సి ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కొనుగోలు చేసింది. ఈ నెల మూడోవారం నాటికి పాఠశాలల్లో బిగించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ సాంకేతిక పరికరాలను ఎలా ఉపయోగించాలో ఉపాధ్యాయులకు అవగాహన లేదు. కాబట్టి వీటిపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఎంటెక్‌ పూర్తిచేసిన విద్యార్ధులను తక్కువ వేతనంతో ఈ శిక్షణ కోసం ఉపయోగించుకోవాలని ఆలోచన చేసింది. అయితే వారు ఆసక్తి చూపకపోవడంతో ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్ధులతో ఇంటర్న్‌షిప్‌ పేరుతో శిక్షణ ఇప్పించాలని భావిస్తోంది. రాష్ట్రంలో చివరి సంవత్సరం కంప్యూటర్‌ కోర్సులు చేస్తున్న విద్యార్ధులు 65 వేల మంది ఉన్నారు. ఈ కోర్సులు చేస్తున్న బిటెక్‌ 8వ సెమిస్టర్‌, డిగ్రీ 6వ సెమిస్టర్‌ విద్యార్ధులతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్టయిఫండ్‌ కింద విద్యార్థులకు రూ.12వేలు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2వేల మంది విద్యార్ధులను ఈ పద్ధతిలో నియమించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులు ఆసక్తిని చూపి దరఖాస్తులు 2వేలు దాటితే రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఎంపికైన ఒక్కొ విద్యార్ధికి మూడు పాఠశాలలు చొప్పున 2వేల మందికి 6వేల పాఠశాలలు అప్పగిస్తారు.

➡️