1921 తర్వాత ఈ ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు అత్యధికం

May 1,2024 07:24 #Telangana, #temparature

-పలుచోట్ల 44 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు
-మరో 5 రోజులూ తప్పని తీవ్ర వేడిగాలుల ప్రభావం
తెలంగాణ : ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 ఏండ్లలో ఎన్నడూలేని అత్యధిక ఉష్ణోగ్రతలు ఈసారే నమోదయ్యాయి. వాతావరణశాఖ అందించిన సమాచారం ప్రకారం 1921 తర్వాత 2024కు ముందు ఏ ఒక్క సంవత్సరంలోనూ 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు.
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాష్ట్రంలో పలుచోట్ల 44 డిగ్రీలు దాటడం విశేషం. రానున్న ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెకనున్నదని ఐఎండీ హెచ్చరించింది. ఈ ఐదురోజుల్లో దేశంలోని తూర్పు, దక్షిణ భాగంలో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయి.
మే నెలలో గతంలో కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలుస్తున్నది. ఇప్పటికే రెండో దశ పోలింగ్‌పై ఎండల ప్రభావం పడినట్టు ఎన్నికల అధికారుల దఅష్టికి వచ్చింది. మే నెలలో జరిగే మిగతా 5 దశల పోలింగ్‌పై కూడా ఎండల ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ భావిస్తున్నది. ఓటింగ్‌ శాతం తగ్గే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మే 3 వరకు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. రానున్న రెండు మూడు రోజుల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. సాధ్యమైనంత వరకు ఇంటి వద్దే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు తెలంగాణ, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

➡️