ఉరవకొండలో ఉద్రిక్తత – జీతాలు అడిగినందుకు అక్రమ కేసులు..!

రాయదుర్గం (అనంతపురం) : పండగ రోజున ఉరవకొండ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

జీతాలను చెల్లించాలని కోరుతూ … శ్రీరామ్‌ రెడ్డి వాటర్‌ వర్కర్లంతా సమ్మె చేస్తున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సమ్మె చేస్తున్న వాటర్‌ కార్మికులు ఉరవకొండ పోలీస్‌ స్టేషన్‌కు రావాలని ఉరవకొండ ఎస్సై నుండి ఫోన్‌ కాల్‌ వచ్చింది. అప్పటికే ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఈ శ్రీనివాసులు కార్మికులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉరవకొండ అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కార్మికులు పైపులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఆరుగురు తాగునీటి విభాగంలో పనిచేసే కార్మికులపై కేసు నమోదు చేయడానికి ఉరవకొండ పోలీసులు సిద్ధమయ్యారు. తమపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో రాయదుర్గం, కళ్యాణదుర్గం కార్మికులు, సిఐటియు యూనియన్‌ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్‌ స్టేషనుకు వచ్చారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై తప్పుడు కేసులు ఎలా బనాయిస్తారంటూ.. ఫిర్యాదు చేసిన అధికారులను ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కాసేపు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్‌, సిఐటియు ఉరవకొండ మండల నాయకులు మధు, రంగయ్య అధికారులు మాట్లాడుతూ …. కార్మికులు జీతాలు అడిగితే అక్రమ కేసులు పెడతారా ? అని ప్రశ్నించారు. ఇలా అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జీతాలు వేసేంతవరకు సమ్మె కొనసాగిస్తామని, కార్మిక సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆర్‌డబ్ల్యుఎస్‌ఈ ఆఫీసును ఈనెల 18వ తేదీన ముట్టడిస్తామని ప్రకటించారు. అన్యాయంగా కార్మికులపై అక్రమ కేసులు పెట్టిన డీఈ శ్రీనివాసులను సస్పెండ్‌ చేయాలని, దీనికి కారకులైన సొల్లాపురం సర్పంచ్‌ భాస్కర్‌ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని యూనియన్‌ నాయకులు కార్మికులు డిమాండ్‌ చేశారు.

➡️