మున్సిపల్‌ కార్మికులపై దాష్టీకం

– పోటీ కార్మికులతో పనులు

– అడ్డుకున్న కార్మికులు

– విశాఖలో 500 మంది అరెస్టు

– నరసరావుపేటలో పోటీ కార్మికులను దింపిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన సమ్మె

ప్రజాశక్తి – యంత్రాంగం :మున్సిపల్‌ కార్మికులపై పోలీసులు అక్రమ అరెస్టులకు తెగబడ్డారు. పలు చోట్ల పోలీసుల వలయంలో పోటీ కార్మికులతో అధికారులు పనులు చేయించారు. వారిని కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులు బలవంతపు అరెస్టులకు పాల్పడ్డారు. విశాఖలో 500 మంది కార్మికులను, ప్రజాసంఘాల నాయకులను స్టేషన్లకు తరలించారు. పల్నాడులో స్వయానా ఎమ్మెల్యేనే పోటీ కార్మికులను రంగంలోకి దింపారు. వారిని కార్మికులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్మికులు నిరసనను తెలిపారు.పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రోద్బలంతో పోటీ కార్మికులను దింపారు. వీరిని అడ్డుకునేందుకు కార్మికులు ప్రయత్నిస్తుండగా వారిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. దీంతో కార్మికులను పోలీసులు సమ్మె శిబిరం వద్దకు తీసుకెళ్లారు. అయితే ఎమ్మెల్యే దగ్గరుండి పనులు చేయిస్తుండడంతో కార్మికులు మరోసారి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయకులపై ఎమ్మెల్యే సైతం వాగ్వాదానికి దిగారు. పోలీసుల రక్షణ వలయంలో పోటీ కార్మికులతో పనులు చేయించారు. ఇదిలా ఉండగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి సాల్మన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా విడుదల కోసం కార్మికులు స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయనను విడుదల చేశారు. తెనాలిలో సమ్మె శిబిరాన్ని జనసేన పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సందర్శించి మద్దతు తెలిపారు.విశాఖ జివిఎంసి పరిధిలో వాహనాలను నిలిపి ఉంచే యార్డుల వద్ద మున్సిపల్‌ కార్మికులు నిరసన తెలిపారు. పోటీ కార్మికులతో వాహనాలను బయటకు తీసి పారిశుధ్య పనులను చేపట్టడం కోసం జివిఎంసి అధికారులు చేసిన ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించారు. వాహనాలను బయటికి తీయకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడకక్కడ అరెస్టులకు పాల్పడ్డారు. విశాఖ నగర పరిధిలో 500 మందిని అరెస్టు చేశారు. అనంతరం విడుదల చేశారు. నీటి సరఫరా కార్మికులు కూడా సమ్మెలోకి దిగారు. సమ్మెలో భాగంగా వారంతా జివిఎంసి గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. వారి పోరాటానికి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు సంఘీభావం తెలిపారు. మధురవాడ ప్రాంతంలోని జివిఎంసి 5, 6, 7, 8 వార్డుల్లో సమ్మెలో ఉన్న కార్మికులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకకువెళ్లి జీపుల్లో ఎక్కించారు. అనకాపల్లిలో జివిఎంసి జోనల్‌ కార్యాలయం ముందు వంటా-వార్పు చేపట్టారు. మున్సిపల్‌ వాహనాలను, చెత్తను తరలించేందుకు పోటీ కార్మికులను అధికారులు తీసుకురాగా అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పోటీ కార్మికులను అడ్డుకున్న మున్సిపల్‌ కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కార్మికుల అక్రమ అరెస్టును అడ్డుకున్న ప్రజాసంఘాల నాయకులను సైతం అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. సాయంకాలం వారందరిని విడుదల చేశారు. నెల్లూరులో కార్పొరేషన్‌ అధికారులు పోటీ కార్మికులను విధుల్లోకి తీసుకొచ్చి విజయమహాల్‌ గేటు ప్రాంతంలో చెత్త తొలగింపుకు పూనుకోగా… కార్మికులు అడ్డుకున్నారు.పోటీ కార్మికులను అడ్డుకోవద్దంటూ హెల్త్‌ ఆఫీసర్‌, పోలీసు అధికారులు వాగ్వివాదానికి దిగారు.విజయవాడలో మున్సిపల్‌ సమ్మెకు సిఐటియు, సిపిఎం, బెఫీ, ఎల్‌ఐసి, తదితర సంఘాలు మద్దతు తెలిపాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, యూనియన్‌ నగర గౌరవాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్‌, యూనియన్‌ నగర అధ్యక్షులు ఎస్‌.జ్యోతిబస్‌ పాల్గని మాట్లాడారు. తక్షణం చర్చలు జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతపురం కార్పొరేషన్‌లో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫొటోలతో ఉన్న మాస్కులను ధరించి… కార్మికులపై అనుసరిస్తోన్న నిర్లక్ష్య వైఖరిని కళారూపంలో తెలియజేశారు. తాడిపత్రిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ పాల్గన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో సమ్మె శిబిరం నుంచి టవర్‌క్లాక్‌ సెంటర్‌ వరకూ అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.గోపీనాథ్‌ మద్దతు తెలిపారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోకాళ్లపై నిలబడి, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద అర్ధనగ ప్రదర్శన చేపట్టారు. కర్నూలు జిల్లా గూడూరులో తలకిందులుగా నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. కడప జిల్లా రాయచోటిలో డ్రమ్స్‌ వాయిస్తూ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం, మండపేట, రామచంద్రపురం, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద, తూర్పుగోదావరిలో కొవ్వూరు, నిడదవోలు మున్సిపల్‌ కార్యాలయాల వద్ద, కాకినాడ జిల్లాల్లో పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాలను కొనసాగించారు.

 

➡️