ఉత్పత్తి రంగాలను దెబ్బతీస్తున్న కేంద్రం

– పోరాటాలకు వ్యవసాయ కార్మికులు సిద్ధం కండి

– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సదస్సులో జాతీయ అధ్యక్షులు విజయ్ రాఘవన్‌

– భూ పంపిణీకి మద్దతిచ్చే పార్టీలకు మద్దతు : బి.వెంకట్‌

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :దేశంలో ఉత్పాదక రంగాలకు ప్రోత్సహకాలు ఇవ్వకుండా కేవలం సేవా రంగంపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోందని ఆల్‌ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు ఎ.విజయరాఘవన్‌ అన్నారు. ‘వ్యవసాయ రంగం సంక్షోభం, వ్యవసాయ కార్మికులపై ప్రభావం, భూ సమస్య, దాని ప్రాధాన్యత’ అనే అంశంపై రాష్ట్ర సదస్సు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన గుంటూరు బ్రాడీపేట పిఎల్‌రావు భవన్‌లోని కొరటాల మీటింగ్‌ హాల్‌లో శనివారం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో విజయరాఘవన్‌ మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలను ముమ్మరం చేయాలని కోరారు. ఉత్పాదక రంగాల్లో దేశం తిరోగమనంలో పయనిస్తోందని, సేవా రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధారపడుతున్నాయని, తద్వారా రాబోయే కాలంలో ఆర్ధిక సంక్షోభం మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. బిజెపి ఆర్థిక విధానాల వల్ల దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతోదన్నారు. వ్యవసాయ కార్మికులు పనుల్లేక ఆకలి చావులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్ధిక వృద్ధి రేటు గణనీయంగా పడిపోతుందని తెలిపారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం స్వచ్ఛమైన పరిపాలన అందిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం ఇడి అధికారులను ఉపయోగించి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. కమ్యూనిస్టులు అవినీతికి దూరంగా ఉంటారని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ పేదలు, వ్యవసాయ కార్మికులకు భూములు పంపిణీ చేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా మరోసారి ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉందని, కరోనా కష్టకాలంలో రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కార్మికులు కష్టపడి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తే వారికి కనీసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇవ్వలేదన్నారు. మొత్తం జిడిపిలో 40 శాతం వ్యవసాయ రంగం నుంచి వస్తున్నా ఈ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ధనికుల చేతుల్లో ఎక్కువ భూమి ఉందని, ఆ భూమిని పేదలకు పంపిణీ చేయడం ద్వారా వ్యవసాయ కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. వ్యవసాయరంగానికి ప్రోత్సహకాలు లేకపోవడం వల్ల నష్టాలపాలైన రైతులు పరువు కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆకలి భరించలేక వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో భూ పంపిణీని మేనిఫెస్టోలో పెట్టే పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ స్వామినాథన్‌, జయతిఘోష్‌ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఇప్పటికీ 64 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటే ఈ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందన్నారు. నూతన ఆర్ధిక విధానాల అమలు తరువాత రైతులకు తగిన ప్రోత్సహం లేదని తెలిపారు. వ్యవసాయరంగాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలో జయతిఘోష్‌ కమిటీ అనేక సిఫార్సులు చేసిందన్నారు. ప్రాజెక్టులు నిర్మించి ఉచితంగా సాగునీరు ఇవ్వాలని, ఎరువులు, పురుగుమందులు సబ్సిడీపై ఇవ్వాలని సూచించారని వివరించారు. గత ఐదేళ్లలో ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. బడా పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల రుణాలను ఎగ్గొట్టినా స్పందించని బ్యాంకర్లు సామాన్య రైతులు, కౌలు రైతులు ఒక ఏడాది రుణం కట్టకపోయినా మరుసటి ఏడాది రుణం ఇవ్వడంలేదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కన్వీనర్‌ వంకాయలపాటి శివనాగరాణి, గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు తదితరులు ప్రసంగించారు.

➡️