టిడిపి శ్రేణుల హల్‌చల్‌

Jun 4,2024 22:34 #attack, #ofices, #TDP, #YCP
  • వైసిపి నాయకుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు

ప్రజాశక్తి – యంత్రాంగం : ఎన్నికల ఫలితాల అనంతరం టిడిపి నాయకులు హల్‌చల్‌ చేశారు. వైసిపి నాయకుల ఇటిపైనా, వారి కార్యాలయాలపైనా దాడులకు పాల్పడ్డారు. కూటమి విజయం ఖారారుతో టిడిపి శ్రేణులు కక్ష సాధింపు చర్యలు చేపట్టాయి. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి చట్ట వ్యతిరేక పనులు చేశాయి. రాష్ట్రంలో అక్కడక్కడ దాడులతో ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.

పేర్ని నాని ఇంటిపై రాళ్లు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామానాయుడు సెంటర్‌ వద్ద ఉన్న పేర్ని నాని ఇంటిపై కొందరు టిడిపి, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే నాని ఇంటి వద్దకు చేరుకుని పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విడదల రజని కార్యాలయంపై దాడి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టిడిపి, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బృందావన్‌గార్డెన్‌, చంద్రమౌళి నగర్‌, విద్యానగర్‌ ప్రాంతాల్లో ర్యాలీగా వెళుతూ టిడిపి, జనసేన కార్యకర్తలు చంద్రమౌళి నగర్‌ వద్దకు రాగానే అక్కడ రజిని కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం ఉన్న మౌర్య ఫంక్షన్‌ హాల్‌ భవనం అద్దాలు పగిలాయి. పోలీసులు వారిని చెల్లా చెదురు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వేలాది మంది దాదాపు రెండు, మూడు గంటలపాటు అక్కడే మోహరించటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి స్వయంగా రంగంలోకి దిగి టిడిపి శ్రేణులను అక్కడి నుండి బలవంతంగా పంపించి, కార్యాలయానికి ఉన్న అన్ని దారుల్లో బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. సిఆర్‌పిఎఫ్‌ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు.

లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంపైనా దాడి..
ఒకవైపు విడదల రజిని కార్యాలయం వద్ద పరిస్థితులు అదుపులోకి వస్తున్న సమయంలోనే స్థానిక ఎన్‌టిఆర్‌ స్టేడియం ఎదురుగా ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంపై దాడి జరిగింది. కార్యాలయంలోని కుర్చీలు, కిటికీ అద్దాలు, కంప్యూటర్లు పగిలిపోయాయి. గేటు వద్ద ఉన్న కటౌట్లను కూల్చివేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను కింద పడేసి పగులగొట్టారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి అక్కడికి చేరుకొని గుంపును చెదరగొట్టారు. అక్కడా సిఆర్‌పిఎఫ్‌ బలగాలను బందోబస్తు పెట్టటంతో పరిస్థితి సద్దుమణిగింది.

అన్నా క్యాంటీన్‌, వైసిపి కార్యాలయంపై దాడి
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో మెరకవీధిలోని వైఎస్‌ఆర్‌సిపి ప్రధాన కార్యాలయం, బస్‌ స్టాండ్‌ సమీపంలోని అన్న క్యాంటీన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు అన్న క్యాంటీన్‌ భవనంలోని వస్తువులు ధ్వంసం చేశారు. వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయం వద్ద గల రెండు కార్ల అద్దాలు పగులకొట్టారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ విషయమై తమకు ఎటువంటి ఫిర్యాదూ రాలేదని పోలీసులు తెలిపారు.

రుషికొండ భవనాలపై టిడిపి జెండాలు
విశాఖ రుషికొండపై వైసిపి ప్రభుత్వం నిర్మించిన భవనాలపై మంగళవారం ఉదయం ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే టిడిపి జెండాలు ఎగరడం కలకలం రేపింది. ఎన్నికల ఫలితాలు కూటమికి సానుకూలంగా వస్తుండడంతో కొంతమంది వ్యక్తులు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి భవనాలపైకి చేరారు. టిడిపి జెండాలు ఎగరవేసి హల్‌చల్‌ చేశారు. భద్రతా సిబ్బంది తేరుకుని వారిని పట్టుకునేలోపు పరారయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఎవరు జెండాలు ఎగురవేశారన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

➡️